ఆ మూడు రోజులు ఉభయ సభలకు హాజరుకావాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ..
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:05 PM
కాంగ్రెస్ సభ్యులందరూ ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. ఆయా రోజుల్లో కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఎఫ్‌సీఆర్‌ఏ (Foreign Contribution Regulation Act) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీకి చెందిన ఉభయ సభల ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ కాంగ్రెస్ ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆగస్టు 10, 11, 12 తేదీల్లో తమ తమ సభల్లో తప్పనిసరిగా హాజరు కావాలని పార్లమెంటు సభ్యులను కోరింది. ఈ మేరకు రాజ్యసభలోని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ విప్ జారీ చేశారు.
ఈ సందర్భంగా 2026 ఆగస్టు 10, 11, 12 తేదీల్లో రాజ్యసభలో చాలా ముఖ్యమైన అంశాలను చర్చకు తీసుకోనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరకు తప్పనిసరిగా సభలో సభ్యులు ఉండాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలని కోరారు. మరోవైపు, లోక్‌సభలోని కాంగ్రెస్ సభ్యులకూ పార్టీ ఇదే విధమైన విప్ జారీ చేసింది. ఆ మూడు రోజుల పాటు కాంగ్రెస్ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొంది. అదేవిధంగా ఇండియా కూటమిలోని అన్ని మిత్రపక్షాలకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయా పార్టీల ఎంపీలందరూ హాజరుకావాలని కోరింది.
కాగా, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, వచ్చే వారం జరగబోయే తాత్కాలిక ప్రభుత్వ కార్యకలాపాల జాబితాను పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడించారు. దాంట్లో ఆ రెండు బిల్లుల గురించి మంత్రి ఎక్కడా ప్రస్తావించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు
ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతాన్ని ఎందుకు మూసివేయకూడదు: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న.