Share News

మరో 25 ఏళ్లు.. 543 సీట్లే

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:16 AM

వచ్చే 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న 543కే స్తంభింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది....

మరో 25 ఏళ్లు.. 543 సీట్లే

  • లోక్‌సభ సీట్లను స్తంభింపజేయాలి

  • 543 సీట్లలోనే మహిళలకు 33ు కోటా ఇవ్వాలి

  • తదుపరి లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలి

  • పార్టీ సమావేశాల్లో వందేమాతరం 2 చరణాలే పాడతాం

  • 1937 నాటి కాంగ్రెస్‌ తీర్మానానికే కట్టుబడి ఉంటాం

  • 800 నగరాల్లో విద్యార్థులతో సభలు

  • అయోధ్య విరాళాల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం

  • అక్టోబరు 31లోగా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం

  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

  • విద్యారంగం, పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై

  • నివేదిక రూపొందించి నెలలోపు ఖర్గేకు సమర్పించాలి

  • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశం

  • కులగణనపై మోదీ సర్కారు ద్వంద్వవైఖరి

  • ప్రదర్శిస్తోందని విమర్శలు

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వచ్చే 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న 543కే స్తంభింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది. ఈ సీట్లలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించి, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలని పేర్కొంది. జనగణనలో భాగంగా కులగణన జరుపుతామన్న హామీని కచ్చితంగా అమలుపరచాలని, తెలంగాణ, బిహార్‌లలో జరిగినట్టుగా కులగణన జరపాలని సూచించింది. 1937లో సీడబ్ల్యూసీ తీర్మానించిన విధంగా వందేమాతర గేయంలోని మొదటి రెండు చర ణాలే ఆలపించాలని నిర్ణయించింది. విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా 800 నగరాల్లో భారీ సభలను నిర్వహించాలని, అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల చోరీపై ఉద్యమించాలని తీర్మానించింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో నాలుగు గంటలకుపైగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో సహా మొత్తం 88 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంలు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్‌, సతీశన్‌, సుఖ్వీందర్‌సింగ్‌ కూడా ఉన్నారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాలను పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వచ్చే 25 సంవత్సరాల వరకూ లోక్‌సభ సీట్లను స్తంభింపచేయాలని, 2023లో పార్లమెంట్‌ ఆమోదించిన విధంగా మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని, లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు కోటా కల్పించాలని తీర్మానించినట్లు తెలిపారు. కులగణనపై ప్రధాని నరేంద్రమోదీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని, జనగణనతో పాటు కులగణన చేపట్టి సామాజిక న్యాయాన్ని అమలు చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సమావేశాల్లో జాతీయగేయం వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీర్మానించామన్నారు. ‘ఈ అంశంలో ఎటువంటి గందరగోళం లేదు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూచన మేరకు.. 1937 అక్టోబరు 28వ తేదీన సీడబ్ల్యూసీ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో నాటి ఉద్ధండ నేతలైన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దానినే అనుసరిస్తాం’ అని స్పష్టం చేశారు. వందేమాతరం తమకు భావోద్వేగానికి సంబంధించిన విషయమని, బీజేపీ మాత్రం దానిని రాజకీయం చేస్తోందని.. ప్రశ్నపత్రాల లీకేజీలు, రామాలయం చందా చోరీ అంశాల నుంచి దృష్టి మళ్లించటానికే ఇదంతానని విమర్శించారు.


పేపర్‌ లీక్‌లపై దేశవ్యాప్త ఉద్యమం

దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్‌, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సీడబ్ల్యూసీ వివరంగా చర్చించిందని, విద్యార్థుల ఉద్యమంపై ప్రభుత్వం అమలు చేసిన దమనకాండను తీవ్రంగా ఖండించిదని వేణుగోపాల్‌, జైరాం తెలియజేశారు. ఈ ఉద్యమం సమయంలో రాహుల్‌గాంధీ అందించిన నాయకత్వాన్ని, ప్రధాని నివాసం వద్ద జరిపిన మెరుపు ధర్నాను వర్కింగ్‌ కమిటీ అభినందించిందన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్‌ పూర్తిగా అండగా ఉంటుందని, దేశవ్యాప్తంగా 800 నగరాల్లో ‘ఛాత్రోంకి ఘూంజ్‌’ పేరిట విద్యార్థుల సభలను నిర్వహిస్తామన్నారు. వీటిలో రాహుల్‌గాంధీ పాల్గొంటారని, ఈ నెల 22వ తేదీన పుణేలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. మరోవైపు తమ తమ రాష్ట్రాల్లో విద్యారంగంలో, పరీక్షల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై నివేదిక రూపొందించి, నెలరోజుల్లోపు పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలను సీడబ్ల్యూసీ ఆదేశించినట్లు పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఖర్గే చేసిన ప్రసంగంలో కూడా విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశ యువత భవిష్యత్తును మోదీ సర్కారు నాశనం చేస్తోందని, ఈ నేపథ్యంలో, యువత కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘విద్య నుంచి ఉద్యోగం వరకూ రోడ్‌మ్యా్‌ప’ను రూపొందించాల్సిన అవసరం ఉందని ఖర్గే చెప్పారన్నారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం విడుదల చేసిన తీర్మానంలో కూడా.. మోదీ 12 ఏళ్ల పాలనలో పేపర్‌ లీకులు ఓ అంటువ్యాధిలా మారాయని, 152 లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. నిరసన తెలిపిన విద్యార్థులు, యువత మీద టియర్‌గ్యాస్‌, పెల్లెట్‌గన్స్‌, ఎలక్ట్రిక్‌ షాక్‌ బ్యాటన్‌లు, ఏకే 47 తుపాకులను ప్రయోగించటాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టటంలో విపక్షం విజయవంతమైందని పేర్కొంది.

గ్రామస్థాయికి చందాచోరీ ఉద్యమం

అయోధ్య రామమందిరంలో జరిగిన చందాచోరీ సాధారణ విషయం కాదని, దీనిపై విచారణను నీరు కార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఈ చోరీ రామమందిరానికే పరిమితం కాదని, అది దేశంలో జరిగిన ఇంటింటి చోరీ అని.. దాదాపు ప్రతి ఇంటినుంచీ భక్తులు రామమందిరం కోసం విరాళిచ్చారని, వారి మనోభావాలతో బీజేపీ చెలగాటమాడిందని దుయ్యబట్టారు. దీనిపై యూపీలోనే గాక దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహి ంచాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని తెలిపారు. గ్రామాలు, పంచాయతీ స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను ఆదేశించినట్లు వెల్లడించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా చొరబాటుతో మోదీ ప్రభుత్వం లొంగుబాటు వెల్లడైందని, మన విదేశాంగ విధానం తొలుత అమెరికాకు, ఇప్పుడు చైనాకు దాసోహం అయిందని సీడబ్ల్యూసీ విమర్శించినట్లు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా పోలింగ్‌ బూత్‌ నుంచి కేంద్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేసే కార్యక్రమం అక్టోబరు నాటికి పూర్తి కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న సభావేదికపై సంఘ్‌ పరివార్‌ శక్తులు శుద్ధీకరణ చేపట్టినందుకు మోదీ క్షమాపణ చెప్పాలని సీడబ్ల్యూసీ డిమాండ్‌ చేసింది. ఇది బీజేపీ అగ్రవర్ణ దురహంకారానికి సంకేతమని విమర్శించారు. ఈ20 పెట్రోల్‌తో ఎదురవు తున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి, వీలైనంత త్వరలో పరిష్కారం వెదకాలని డిమాండ్‌ చేశారు.


తెలంగాణలో కులగణన భేష్‌

తెలంగాణలో జరిగిన కులగణనపై సీడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. దేశానికే రోల్‌ మోడల్‌గా నిర్వహించారని పేర్కొంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. తెలంగాణలో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, పార్టీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, డీసీసీల నుంచి మండల స్థాయిల వరకూ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను రేవంత్‌రెడ్డి వివరించారు. 1.06 కోట్ల మంది ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించామని తెలిపారు. అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చామని, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై నివేదిక ఇచ్చామని రఘువీర్‌ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 20 , 2026 | 06:16 AM