వాణిజ్య సిలిండరుపై మళ్లీ బాదుడు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:32 AM
వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. రూ.42 మేర పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడున్న...
రూ.42 పెంపు.. రూ.3,113కి చేరుకున్న ధర
27 శాతం మేర తగ్గిన ఏటీఎఫ్ ధర
న్యూఢిల్లీ, జూన్ 1: వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. రూ.42 మేర పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడున్న రూ.3,071 నుంచి రూ.3,113కి పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులతో ఈ ధర మారే అవకాశం ఉంది. నెలవారీ సమీక్షలో భాగంగా కమర్షియల్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు పెంచాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉండే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ (ఎఫ్‌టీఎల్) ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.11 మేర పెంచారు. దీంతో ఆ సిలిండర్ ధర రూ.821కి పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను మే 1వ తేదీన ఒకేసారి రూ.993 మేర పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉపయోగించే ఇంధనం (ఏటీఎఫ్) ధరను 27 శాతం మేర తగ్గించారు. ఫలితంగా కిలో లీటరు ఏటీఎఫ్ ధర 400కుపైగా డాలర్లు తగ్గి 1100 డాలర్లకు చేరుకుంది. దేశీయ విమాన సర్వీసుల ఇంధనం ధరలో మార్పు లేదు. గత నెల ధరల సవరణలో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వాడే ఇంధనం ధరను కిలో లీటరుకు 76.55 డాలర్ల చొప్పున పెంచారు. ప్రస్తుతం భారీగా తగ్గించటంతో విమానయాన సంస్థలకు ఉపశమనం లభించనుంది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం