తగ్గిన వాణిజ్య గ్యాస్ ధర
ABN , Publish Date - Jul 02 , 2026 | 06:30 AM
అమెరికా-ఇరాన్ యుద్ధం దాదాపు ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం వాణిజ్య ఎల్‌పీజీ, ఏవియేషన్...
19 కిలోల సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు..హైదరాబాద్‌లో రేటు రూ.3,191
న్యూఢిల్లీ, జూలై 1: అమెరికా-ఇరాన్ యుద్ధం దాదాపు ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం వాణిజ్య ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బయిన్ ఫ్యుయెల్ (ఏటీఎఫ్) ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్‌పై రూ.183.50 వరకు తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడీ సిలెండర్ ధర రూ.2,930కి.. విజయవాడలో రూ.3,128, హైదరాబాద్‌లో 3,191కి తగ్గింది. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (ఎఫ్‌టీఎల్) సిలెండర్ ధరను రూ.13 వరకు తగ్గించారు. దీంతో దీని ధర ఢిల్లీలో రూ.808.50కి చేరింది. అయితే గృహ వినియోగదారులు వాడే వంటగ్యాస్ ధర(రూ.942)ను తగ్గించలేదు. ఏటీఎ్‌ఫపై లీటరుకు రూ.5 తగ్గించారు. దీంతో ఢిల్లీలో ఈ ఇంధనం ధర లీటరు రూ.110కి చేరింది. నయారా లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గత మార్చిలో పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెంచిన మొదటి కంపెనీ ఇదే. ఆ తర్వాత ప్రభుత్వ చమురు సంస్థలు లీటరుపై రూ.7.50 వరకు పెంచాయి. నయారా సంస్థకు దేశవ్యాప్తంగా 7 వేల పెట్రోల్ బంకులున్నాయి. బుధవారం ధరలు తగ్గించాక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.87.62, విజయవాడలో పెట్రోల్ రూ.112.78, డీజిల్ రూ.102.61కి.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.110.69, డీజిల్ రూ.100.82కి విక్రయిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నానాటికీ తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కూడా త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News