మోదీ కనుసన్నల్లోనే ఈసీ అక్రమాలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:49 AM
ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్లను రెండు వర్గాలుగా విభజించేందుకు, ప్రజల ఓటుహక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు.
మోదీ కనుసన్నల్లోనే ఈసీ అక్రమాలు
ఓటుహక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర
రాహుల్, ప్రియాంకపై పోలీసుల దాడి దారుణం
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
లేదంటే మోదీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది
ఇది ప్రజల ఉద్యమం
ప్రజల హక్కులను కాలరాసినవారు
ఎవరూ తప్పించుకోలేదు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్లను రెండు వర్గాలుగా విభజించేందుకు, ప్రజల ఓటుహక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఈ కుట్రలో భాగమైన ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, ప్రియాంకపై పోలీసులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడితో సమానమని మండిపడ్డారు. రాహుల్, ప్రియాంకను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత వారిని కలిసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోపాటు కేరళ ముఖ్యమంత్రి సతీశన్ ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని గేటు వద్దే అడ్డుకున్నారు. రాహుల్‌గాంధీని మరో గేటు నుంచి బయటకు పంపారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో ఓటుహక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తే.. ఆయనపైనే చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాహుల్‌గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలను అరెస్టు చేసిందని మండిపడ్డారు.
సైమన్ గో బ్యాక్ తరహాలో జీకే గో బ్యాక్..
గతంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో ‘సర్ గో బ్యాక్’, ‘జీకే గో బ్యాక్’ ఉద్యమం నడుస్తోందన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గతంలో రైతుల ఉద్యమం సందర్భంగా మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా.. చివరకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఎంత మొండిగా వ్యవహరించినా జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. అవసరమైతే ఈ వ్యవహారం మరింత ముందుకెళ్లి ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల ఓట్లను తొలగించి ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేసీ చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలపై పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే మోదీ, అమిత్‌షాల అసహనం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పదవులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని రేవంత్ అన్నారు. ప్రజల హక్కులను కాలరాసిన వారు చరిత్రలో ఎవరూ తప్పించుకోలేదని, చివరకు ప్రజల కోర్టులోనే తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం జరుగుతోందని, ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదని, ఇండియా కూటమి ఉద్యమం, ప్రజల ఉద్యమం అని అన్నారు.ప్రజలంతా ఒక్కటై గొంతెత్తితే ప్రభుత్వం తప్పనిసరిగా వినాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.