సీతాకోకచిలుకా నీవెక్కడ?
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:23 AM
జీవవైవిధ్యంలో కీలకమైన సీతాకోకచిలుకలు క్రమంగా అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వాటి జాతుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.
వాతావరణ మార్పులతో వాటి మనుగడకే ముప్పు
ఉష్ణ మండల ప్రాంతాల నుంచి పెరిగిన వలసలు
పర్యవేక్షణ కొరవడటంతో అంతరిస్తున్న జాతులు
బెంగళూరు, అక్టోబరు 31: జీవవైవిధ్యంలో కీలకమైన సీతాకోకచిలుకలు క్రమంగా అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వాటి జాతుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. పర్యవేక్షణ కొరవడటంతోనే వాటి సంఖ్య వేగంగా క్షీణిస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సీతాకోకచిలుకల వైవిధ్యం కలిగిన భారత్ వంటి ఉష్ణమండల దేశాల్లో ఈ క్షీణత ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ సరైన పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వహించిన మూడు కీలక అధ్యయనాల నివేదికలు ‘నేచర్ ఎలాకజీ అండ్ ఎవల్యూషన్’, ‘బయోసైన్స్’, ‘కన్జర్వేషన్ లెటర్స్’ జర్నల్స్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ నివేదికల ప్రకారం.. సీతాకోకచిలుకలు తాము నివసిస్తున్న ప్రదేశాల నుంచి పెద్దసంఖ్యలో వలసలు పోతున్నాయి.
గతంలో అవి ఉన్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వాటి సంఖ్య శరవేగంగా తగ్గిపోతోంది. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎస్‌సీబీఎస్) శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో జరిగిన అధ్యయనంలో భాగంగా 105 దేశాల్లోని 1,758 సీతాకోకచిలుక జాతులను పరిశీలించారు. వాతావరణ మార్పులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా వీటిలో దాదాపు 80శాతం తమ నివాస ప్రాంతాలను మార్చుకున్నట్లు గుర్తించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇవి పర్వతాల పైభాగాల వైపుగా కదులుతున్నాయి. 37 దేశాల నుంచి సేకరించిన డేటా ప్రకారం 1995 నుంచి పర్యవేక్షిస్తున్న సీతాకోకచిలుకల జాతుల్లో సగటున 24 శాతం క్షీణత నమోదైంది. ప్రపంచంలోని మెజారిటీ సీతాకోకచిలుక జాతులు ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవుల్లోనే నివసిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో ఎక్కువ భాగం యూరప్, ఉత్తర అమెరికా దేశాల నుంచే వస్తోంది. ఉష్ణమండలదేశాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఏయే జాతులు, ఎంత వేగంగా అంతరించిపోతున్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!