Share News

ద్రవ్యోల్బణం పెరగొచ్చు. మోదీ సర్కార్‌కు దిశానిర్దేశం లేదని రాహుల్ విమర్శ

ABN , Publish Date - Mar 21 , 2026 | 09:07 PM

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. రూపాయి విలువ పతనం, ఇంధనం ధరలు పెరగడం రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.

ద్రవ్యోల్బణం పెరగొచ్చు. మోదీ సర్కార్‌కు దిశానిర్దేశం లేదని రాహుల్ విమర్శ
Rahul gandhi

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. రూపాయి విలువ పతనం, ఇంధనం ధరలు పెరగడం రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.


'డాలర్‌తో పోల్చిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. త్వరలోనే అది 100 మార్క్‌ను తాకవచ్చు. పారిశ్రామిక ఇంధనం ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. ఇవి కేవలం గణాంకాలు కావు. ద్రవ్యోల్బణం పెరగబోతోందనడానికి సంకేతాలు' అని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కరెన్సీ పతనం, ధరలు పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఇది సాధారణ పరిస్థితి అని ప్రభుత్వం చెప్పవచ్చు కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉందని, సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుందని అన్నారు.


నాలుగు రకాలుగా సామాన్యుడిపై ప్రభావం

సామాన్యుడిపై నాలుగు రకాలుగా ద్రవ్యోల్బణం ప్రభావం పడుతుందని రాహుల్ పేర్కొన్నారు. వస్తువుల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరుగుతాయని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై (ఎంఎస్ఎంఈ) తీవ్ర ప్రభావం పడి అవి కుదేలవుతాయని, ప్రతి వస్తువు ధర పెరిగిపోతుందని, విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వేగంగా తరిలిపోతాయని, ఇందువల్ల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని చెప్పారు.


ఎన్నికల తర్వాత బాదుడే..

త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగనున్నాయని, అవి పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతుందని రాహుల్ జోస్యం చెప్పారు. కేంద్రంపై నేరుగా విరుచుపడుతూ... ఆర్థిక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే స్పష్టమైన ప్రణాళిక ఏదీ కేంద్రం వద్ద లేదని అన్నారు. 'మోదీ ప్రభుత్వానికి దిశానిర్దేశం కానీ వ్యూహం కానీ లేవు. వారి వద్ద ఒట్టి మాటలే ఉన్నాయి. ప్రభుత్వం ఏమి చెబుతుందనేది కాదు..సామాన్యుడి పళ్లెంలో ఏమి మిగిలిందనేదే అసలు ప్రశ్న' అని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

Updated Date - Mar 21 , 2026 | 09:13 PM