Share News

‘బొద్దింకల’పై అంచనాలు బోల్తా!

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:50 AM

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పోరాటంలో భాగంగా కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) పార్లమెంటు ముట్టడికి ఇచ్చిన పిలుపును ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నారనే...

‘బొద్దింకల’పై అంచనాలు బోల్తా!

  • 3 వారాల క్రితమే కాక్రోచ్‌ ‘చలో’ పిలుపు

  • తేలిగ్గా తీసుకున్న పోలీసులు, కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 21: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పోరాటంలో భాగంగా కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) పార్లమెంటు ముట్టడికి ఇచ్చిన పిలుపును ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాక్రోచ్‌ నేతలు మూడు వారాలుగా ప్రకటనలు ఇస్తున్నా ‘చలో పార్లమెంటు’కు ఎంతమంది తరలి వస్తారనేది అంచనా వేసి, దానికి తగినట్టు అప్రమత్తం కావడంలో పోలీసులు విఫలం అయినట్టు కనిపిస్తోంది. తీరా అతి భారీ జన సందోహం రోడ్ల మీదకు కదిలి, పార్లమెంటు ద్వారం వద్దకు చేరుకునేసరికి పోలీసులు ఒకరకంగా చేతులు ఎత్తేశారు. చివరి నిమిషంలో పెద్ద ఎత్తున లాఠీచార్జి చేయాల్సి రావడం, దానికి ప్రతిగా రాళ్ల వర్షం కురవడంతో ఢిల్లీ సోమవారం రణరంగాన్ని తలపించింది. నిజానికి, గత 15 ఏళ్లలో ఢిల్లీ అనేక భారీ ప్రజా ప్రదర్శనలనే చూసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో రైతులు సాగించిన నిరసన ప్రదర్శన ఎర్రకోట వరకు సాగింది. దానికి ముందు.. నిర్భయ అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 2012లో సాధారణ పౌరులు వేల సంఖ్యలో రైసినా హిల్స్‌ ద్వారం వరకు చొచ్చుకు వెళ్లారు. అయితే, ఆ ప్రదర్శనలను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించగలిగారు. దీనికి భిన్నంగా కాక్రోచ్‌ ‘చలో పార్లమెంటు’ ప్రదర్శనను ఏ దశలోనూ పోలీసులు నిలువరించలేకపోయారు. సోమవారం, చలో పార్లమెంటు మొదలయ్యే సమయానికి అక్కడ 5వేల మంది ఉన్నట్టు పోలీసులు అంచనా వేశారు. మహా అయితే మరో ఐదు వేలమంది అదనంగా ప్రదర్శనలో కలుస్తారని భావించారు. కానీ, పార్లమెంటు మార్గంలోకి సాగే అన్ని దారులూ ఆందోళనకారులతో నిండిపోయాయి. అనేకమంది మహిళా ఉద్యమకారులు, విద్యార్థులు ఢిల్లీ సమీప రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. వీరందరినీ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కాక్రోచ్‌ పార్టీ నేతలు సమన్వయం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 05:50 AM