Share News

మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలి: అభిజీత్ దీప్కే..

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:10 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించడం కంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మోదీ బాగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.

మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలి: అభిజీత్ దీప్కే..
CJP Founder Abhijeet Deepke

మహారాష్ట్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించడం కంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మోదీ బాగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని నడిపే బాధ్యతను మరో నాయకుడికి అప్పగించాలన్నారు. ఢిల్లీలో నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలిసారి తన స్వస్థలమైన మహారాష్ట్రకు అభిజీత్ చేరుకున్నారు.


వేధింపులు ఆపాలి..

ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆందోళనలను విరమించిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి నిరసనకారులను గుర్తించి వేధిస్తున్నాయని ఆరోపించారు. ఆయా ప్రభుత్వాలు వెంటనే ఈ వేధింపులను ఆపాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో విద్యార్థులు, యువత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదన్నారు. యువత ఆగ్రహం ఒక్క మంత్రిపై కాదని, కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. యువతలో ఉన్న అసంతృప్తిని బీజేపీ ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతోందని అభిజీత్ విమర్శించారు.


ప్రభుత్వాన్నే మార్చేస్తాం..

ఇలాగే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అభిజీత్ హెచ్చరించారు. వీరు ఉగ్రవాదులు కాదని, దేశ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును ఇలాంటి పరిస్థితులకు గురి చేస్తే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే అవసరమైతే ప్రభుత్వాన్నీ మార్చే ఉద్యమం చేపడతామని తేల్చిచెప్పారు. ఈసారి ఆందోళన మరింత భారీస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసన సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్ వినియోగించిన ఘటనపైనా అభిజీత్ స్పందించారు. అమిత్ షా అయినా, మరెవరైనా సరే పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


వేడుక చేస్తే తప్పా..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంపై వచ్చిన విమర్శలను సీజేపీ వ్యవస్థాపకుడు తిప్పికొట్టారు. కార్యకర్తలు 36 రోజుల పాటు ఎండ, వర్షాన్ని లెక్కచేయకుండా కష్టపడి పోరాడారని, అలాంటి విజయం తర్వాత సంబరాలు చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ కూడా సంబరాలు చేసుకుంటుందని గుర్తు చేశారు. తమ కార్యకర్తలు బీజేపీ మాదిరిగా రహదారులను దిగ్బంధం చేయలేదన్నారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను పార్లమెంట్‌లో బీజేపీ సన్మానించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఆయనను సన్మానించడం ద్వారా బీజేపీ ఏ సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు.


కంగనా పార్ట్‌టైమ్ పొలిటీషియన్..

పేపర్ లీక్ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని అభిజీత్ ఆరోపించారు. ప్రధాని మోదీ మూడు రోజుల క్రితం పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే తొలి విచారణకే సీబీఐ తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో కేసు వాయిదా పడిందని విమర్శించారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన విమర్శలపైనా అభిజీత్ దీప్కే స్పందించారు. ఆమె పార్ట్‌టైమ్ రాజకీయ నాయకురాలని, సీరియస్ రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకే తాను స్పందిస్తానని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ.. అనితా దీప్కే ఏం చెప్పారంటే..

యంగ్ హృతిక్‌లా ఉంటానని ఫ్రెండ్స్ అంటారు: కంగనాకు సౌరవ్ దాస్ కౌంటర్..

Updated Date - Jul 30 , 2026 | 01:24 PM