Share News

ప్రధాన్‌ను తప్పించే బాధ్యత ప్రధానిదే

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:03 AM

పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారం రోజుల్లో తనంత తాను వైదొలగాలని.. లేదంటే కేంద్రప్రభుత్వమైనా బర్త్‌రఫ్‌ చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ...

ప్రధాన్‌ను తప్పించే బాధ్యత ప్రధానిదే

యువత గళమెత్తితేనే వ్యవస్థ గాడిన

కేంద్ర విద్యా మంత్రి వారంలో వైదొలగకపోతే భారీగా నిరసనలు

సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే హెచ్చరిక

  • జంతర్‌మంతర్‌ ధర్నా ట్రయలర్‌ మాత్రమే

  • సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే పిలుపు

న్యూఢిల్లీ, జూన్‌ 7: పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వారం రోజుల్లో తనంత తాను వైదొలగాలని.. లేదంటే కేంద్రప్రభుత్వమైనా బర్త్‌రఫ్‌ చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. ఆయన్ను తప్పించే బాధ్యత ప్రధాని మోదీదేనన్నారు. అలా చేయకుంటే క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున నిరసనలు సాగిస్తామని హెచ్చరించారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ‘ఎక్స్‌’లోనూ పోస్టు చేశారు. ప్రధాన్‌ దిగిపోయేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. యువత ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. వారు గళమెత్తితేనే వ్యవస్థ సక్రమ మార్గంలో నడుస్తుందన్నారు. ‘ఐదేళ్లకోసారి ఓట్లు వేయడం రాజకీయం కాదు. ప్రజలు ఎవరికి ఓటేశారో.. వారిని ప్రశ్నించి తీరాలి’ అని స్పష్టంచేశారు. జంతర్‌మంతర్‌ ధర్నాలో ప్రధాని మోదీ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించగా.. పరీక్షల వైఫల్యానికి జవాబుదారీ ఎవరో నిర్ధారించకపోతే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను తీసుకోవలసిన బాధ్యత ప్రధానిపై ఉందని బదులిచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆయన ఆపగలిగినప్పుడు పేపర్‌ లీక్‌ను ఆపలేరా అని ప్రశ్నించారు. జెన్‌ జీ భయపడదని శనివారంనాటి జంతర్‌మంతర్‌ ధర్నా నిరూపించిందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెప్పారు. తన భద్రతపై తన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. అయితే తానిప్పుడు ఒంటరివాడిని కాదని వారికి చెప్పానని అభిజీత్‌ అన్నారు. సీజేపీ ఉద్యమం పుట్టి 15 రోజులు మాత్రమేనని.. అప్పుడే భవిష్యత్‌ ప్రణాళికల గురించి మాట్లాడడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, వారం తర్వాత ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. జంతర్‌మంతర్‌ ధర్నా ట్రయలర్‌ మాత్రమేనన్నారు. కాగా.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని దీప్కే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో 11 మంది పోలీసులను మోహరించగా.. ఇప్పుడు 15 మందికి పెంచామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.


ఆ పేరు మార్చుకోండి..

బొద్దింకల జనతా పార్టీ అన్న పేరును మార్చుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత, హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ ఆ పార్టీ నేతలకు సూచించారు. ‘ఇది ప్రజాస్వామ్యం. పోరాడే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే బొద్దింక కనబడితే చిన్న పిల్లవాడైనా దానిని చెప్పుతో కొట్టి చంపుతాడు. అందుచేత మీ పార్టీ పేరు మార్చుకుంటే బాగుంటుంది’ అని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 06:03 AM