కేసుల పరిధి దాటి వెళ్లొద్దు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:42 AM
మకు కేటాయించిన కేసులను మాత్రమే విచారించాలని, ఆ పరిధి దాటి వెళ్లొద్దని సుప్రీంకోర్టు జడ్జిలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యం
సుప్రీంకోర్టు జడ్జిలకు సీజేఐ సూర్యకాంత్ స్పష్టీకరణ
జస్టిస్ అమానుల్లా ధర్మాసనం రెండు వ్యక్తిగత కేసుల్ని
ప్రజాహిత వ్యాజ్యాల్లా మార్చడంపై అభ్యంతరం
వేరే ధర్మాసనానికి ఆ కేసుల కేటాయింపు
న్యూఢిల్లీ, నవంబరు 18: తమకు కేటాయించిన కేసులను మాత్రమే విచారించాలని, ఆ పరిధి దాటి వెళ్లొద్దని సుప్రీంకోర్టు జడ్జిలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం విచారిస్తున్న రెండు కేసులను వెనక్కి తీసుకున్నారు. ఈ అసాధారణ పరిణామం గురించి హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. తన పేరు మార్పు నేపథ్యంలో తలెత్తిన వివాదంతో ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయానంటూ నోయిడాలోని అమిటా యూనివర్సిటీ మీద అయేషాజైన్ అనే విద్యార్థిని కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆ క్రమంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు, వాటి నియంత్రణ, వాటి నిధులపైనా విచారణ జరపాలని నిర్ణయించి, కేంద్రానికి, రాష్ట్రాలకు, నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. విస్తృతపరిచిన ఈ కేసును జస్టిస్ లు విక్రమ్‌నాథ్, మహదేవన్, అపరేశ్‌కుమార్‌సింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి కేటాయించారు.
దీనిపై ఈ నెల 19వ తేదీన విచారణ జరగనుంది. మరో కేసులో కూడా ఇలాగే జరిగింది. చెన్నైలో అనుమతి లేకుండా భవన నిర్మాణం జరిగిందన్న ఫిర్యాదుపై ‘లోగనాథన్-తమిళనాడు ప్రభుత్వం’ కేసుపై జస్టిస్ అమానుల్లా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది మార్చి 25న విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, వ్యక్తిగత నివాసాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించటం అనే అంశాలను కూడా కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలోని ప్రధాన నగరాల మునిసిపాలిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ విస్తృతకేసును ఈ నెల 23వ తేదీన జస్టిస్ నాగరత్న సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ విధంగా వ్యక్తిగత కేసులను జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లా (పిల్) విస్తృతపరిచి, దేశవ్యాప్త పరిస్థితులను విచారించటంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. నెల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ సమావేశపరిచి.. జడ్జిలు తమకు కేటాయించిన కేసుల పరిధికి మాత్రమే పరిమితం కావాలని, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టటానికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని చెప్పినట్లు సమాచారం. సదరు రెండు వ్యక్తిగత కేసులను వేరే ధర్మాసనానికి సీజేఐ కేటాయించినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు సీజేఐ.. సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, నాగరత్న, సుందరేశ్, నరసింహలతో చర్చించినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు