Share News

ప్రెజర్‌గ్రూప్‌గా పని చేస్తాం

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:40 AM

దేశంలోని వివిధ వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావటానికి ఒక ప్రెజర్‌ గ్రూప్‌గా (ప్రభావ సమూహంగా) కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పని చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్‌ దీప్కే...

ప్రెజర్‌గ్రూప్‌గా పని చేస్తాం

  • రాజకీయాలు, మీడియా, న్యాయవ్యవస్థ,

  • ఈసీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు

  • మాపై అంచనాలు పెరిగాయి..

  • వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తాం: దీప్కే

  • సీజేపీ కోర్‌ గ్రూప్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశంలోని వివిధ వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావటానికి ఒక ప్రెజర్‌ గ్రూప్‌గా (ప్రభావ సమూహంగా) కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పని చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. ‘న్యాయవ్యవస్థ, రాజకీయాలు, మీడియా, ఎన్నికల సంఘంపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఇదే సమయంలో మొదలైన మా ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. అది విద్యారంగానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని కీలక వ్యవస్థలకు సంబంధించి కూడా ఆందోళన అవసరమన్న అంశం ముందుకొచ్చింది. ఈ వ్యవస్థల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఒక ప్రజా ప్రెజర్‌ గ్రూప్‌ అవసరం ఉంది’ అని చెప్పారు. దీప్కే స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సీజేపీ కోర్‌ టీం రెండు రోజుల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దీప్కే విలేకరులతో మాట్లాడారు. దేశంలో రాజకీయపార్టీల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, ఉదయం ప్రజలు ఒక పార్టీకి ఓటు వేస్తే, సాయంత్రానికి వేరే పార్టీలతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. సీజేపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందా అన్న ప్రశ్నకు.. మాకంటే మీడియాకే దీనిపై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది అంటూ దీప్కే చమత్కరించారు. ప్రస్తుతం దేశానికి ఒక ప్రెజర్‌ గ్రూప్‌ అవసరం ఉందని, సీజేపీ ఆ బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. ‘జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మాపై ప్రజల అంచనాలు పెరిగాయి. ఆ మేరకు మా బాధ్యత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో సీజేపీని ఎలా బలోపేతం చేయాలి? విస్తరించాలి? అన్న దానిపై కోర్‌ గ్రూప్‌ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. భవిషత్‌ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటాం’ అని దీప్కే వివరించారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో జనం ఎదుర్కొంటున్న సమస్యలు, విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగం వంటి సమస్యలపైనా దృష్టి పెడతామన్నారు. ఉద్యోగ నియామకాల పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై.. స్వతంత్ర కమిషన్‌తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఝార్ఖండ్‌లో విద్యార్థులు చేస్తున్న నిరసనకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని దీప్కే తెలిపారు. ఝార్ఖండ్‌కు వెళ్లి విద్యార్థులకు అండగా నిలుస్తామని, వారి ప్రతీ డిమాండ్‌కు మద్దతు తెలుపుతామన్నారు. సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ మాట్లాడుతూ.. విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తమకు మార్గనిర్దేశకుడిగా కొనసాగుతారని, ఆయన నుంచి సలహాలు తీసుకుంటామని చెప్పారు. సీజేపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో దీప్కే, అశుతోష్‌ రంకా, సౌరవ్‌దాస్‌, రత్నాసింగ్‌ తదితరులు పాల్గొంటున్నారు. కాగా, సమావేశానికి ముందు అక్కడికి వచ్చిన మీడియాకు, భద్రతగా ఉన్న పోలీసు సిబ్బందికి, సందర్శకులకు అందరికీ దీప్కే స్వయంగా టీ అందించటం విశేషం.


జంతర్‌మంతర్‌ వద్ద ఉగ్రదాడికి కుట్ర!

గత నెల విద్యార్థుల నిరసన కొనసాగిన జంతర్‌మంతర్‌ వద్ద పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలున్న ఉగ్రవాదులు కుట్ర పన్నారని పంజాబ్‌ పోలీసులు బుధవారం వెల్లడించారు. పెట్రోల్‌ బాంబులు తయారు చేయటానికి వారికి పేలుడు పదార్థాలు కూడా అందాయని, కొందరు జంతర్‌మంతర్‌ వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించినట్లు వెల్లడైందన్నారు. రెండు ఉగ్రముఠాలను తాము పట్టుకోవటం వల్ల ఈ కుట్ర గురించి తెలిసిందని, తద్వారా దానిని భగ్నం చేయగలిగామని అమృత్‌సర్‌ పోలీసు కమిషనర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. తొమ్మిదిమందిని అరెస్టు చేశామన్నారు. దీనిపై సీజేపీ కీలక నేత అశుతోష్‌ రంకా స్పందిస్తూ.. ఢిల్లీలో విద్యార్థుల నిరసన వద్దకు ఉగ్రవాదులు రాగలిగారంటే అది ప్రభుత్వ వైఫల్యమమేనన్నారు.

సౌరవ్‌దాస్‌ ఇంటిపై దాడి

ఢిల్లీలోని తమ ఇంట్లోకి బుధవారం ఉదయం కొందరు యూట్యూబర్లు, మీడియా ప్రతినిధులు చొచ్చుకొచ్చి వీడియోలు తీశారని సౌరవ్‌దాస్‌ ఆరోపించారు. అభిజిత్‌ అయ్యర్‌ మిత్రా అనే వ్యక్తి ప్రచారం చేసిన అబద్ధాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:40 AM