సీఎంను విమర్శించే హక్కు పౌరులకు ఉంది!
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:39 AM
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు సామాన్య పౌరులకు ఉందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
పాలకులు విమర్శలకు అతీతులు కారు: మద్రాస్ హైకోర్టు
చెన్నై, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పోలీసులపై కూడా ఉందని పేర్కొంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పాలకుల విధానాలను విమర్శించడం, వాటిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(బి) ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో పాటు విమర్శించే స్వేచ్ఛ కూడా పౌరులకు ఉందని గుర్తుచేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కించపరిచారనే ఆరోపణలతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు చెందిన డీఎంకే కౌన్సిలర్ సుధపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రసంగాలు ఎంత కఠినంగా లేదా వ్యతిరేక ధోరణిలో ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద రక్షణ పొందుతాయని తెలిపింది. ఉన్నత రాజ్యాంగ, ప్రజా పదవుల్లో ఉన్న వ్యక్తులు విమర్శలను ఎదుర్కొనే సహనాన్ని కలిగి ఉండాలని సూచించింది. సీఎంపై ఎవరైనా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే, పరువు నష్టం కేసు దాఖలు చేయాలి గానీ, పోలీసులు కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నించింది. పిటిషనర్‌పై ఆరోపణలు కేవలం రాజకీయ ప్రకటనలే తప్ప, అంతకు మించి ఏమీ కాదని పేర్కొంటూ.. తీవ్రమైన రాజకీయ ప్రసంగం కూడా హింసను ప్రేరేపిస్తేనే శిక్షార్హమైన పరిణామాలకు దారి తీస్తుందని తెలిపింది. దేశమంతటా రాజకీయ చర్చల్లో సోషల్ మీడియా పాత్ర పెరుగుతోందని.. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఐటీ విభాగం ఉందని గుర్తు చేసింది. వాటి ద్వారా ప్రత్యర్థి పార్టీల నాయకులు, మద్దతుదారులు నిత్యం విమర్శలకు, దాడులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్థికవేత్త కళైయరసన్ అరెస్టును ధర్మాసనం ప్రస్తావించింది. మీడియా చూస్తున్నప్పుడు ప్రముఖ వ్యక్తులతో పోలీసులు ప్రవర్తన ఆధారంగా మాత్రమే వారిని అంచనా వేయకూడదని తెలిపింది.
ఎవరూ చూడనప్పుడు సామాన్య ప్రజలతో పోలీసుల వ్యవహార శైలి ఆధారంగా వారి ప్రవర్తనను అంచనా వేయాలని సూచించింది. పోలీసులు అధికార పార్టీకి, ప్రతిపక్షానికి తేడా లేకుండా పని చేయాలని, పోలీసులు ప్రభుత్వానికి సేవ చేయాలే తప్ప, రాజకీయ పార్టీలకు కాదని కటువుగా వ్యాఖ్యానించింది. పాలకులు విమర్శలకు అతీతులు కాదని పేర్కొంది. రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ, అందుకోసం చట్టం నిర్దేశించిన విధానాలనే అనుసరించాలని స్పష్టం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు విమర్శలు, హేళన, చివరికి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసి కూడా అలాంటి బాధ్యతలను స్వీకరిస్తారని పేర్కొంది. ఒక కౌన్సిలర్ చేసే విమర్శ ఉన్నత పదవిలో వున్న వ్యక్తి హోదాను తగ్గించబోదని, అలాంటి విమర్శలకు ప్రతిస్పందించే పేరుతో చర్య తీసుకోవడం ఆ హోదాను దెబ్బతీయగలదని పేర్కొంటూ ధర్మాసనం.. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!
పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్