ఇలాంటి ప్రభుత్వానికా నేను మద్దతు ఇచ్చింది: చిరాగ్
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:19 PM
బిహార్‌లో మహిళలపై నేరాల ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళలపై లైంగిక దాడులు వంటి నేరాలు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఆయన మండిపడ్డారు. సోమవారం పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. బిహార్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ముఖ్యంగా మహిళలపై నేరాలు పెరుగుతుండడం ఆందోళనకరంగా ఉందన్నారు. ‘మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను కాపాడడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. నేరాలు, నేరస్తులను సమ్రాట్ ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోంది. ఇటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు నేను ఎంతో చింతిస్తున్నాను. నేరాలకు అడ్డుకట్ట వేయాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని నేను ముఖ్యమంత్రి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు.
చాలా అసహ్యంగా ఉంది
బిహార్‌లో నేరస్తులు యథేచ్చగా నేరాలు చేసి తప్పించుకుంటున్నారని చిరాగ్ అన్నారు. ఇటువంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వ చేతగానితనాన్ని చూసి తనకు చాలా అసహ్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేరస్తులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని విమర్శించారు. నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోతే దాని పరిణామాలు భవిష్యత్తులో తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కాగా.. బిహార్‌తో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ భాగస్వామిగా ఉంది.
Also Read:
పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..
వైరల్ జ్వరం తగ్గినా దగ్గు తగ్గడం లేదా? ఈ విషయాలు తెలుసుకోండి!