భారత్ సరిహద్దుల్లో చైనా వాటర్ బాంబ్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:05 PM
నేపాల్‌లో తాజాగా సంభవించిన జలప్రళయం వందలాది మందిని బలి తీసుకుంది. అయితే చైనా నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ వల్ల ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: నేపాల్‌లో తాజాగా సంభవించిన జలప్రళయం టిబెట్, నేపాల్ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను ముంచెత్తింది. ఈ ప్రకృతి వైపరీత్యంలో 150 మందికి పైగానే మరణించారు. 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సరిగ్గా ఈ సమయంలో భారత్ సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న మైడాగ్ డ్యామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని డ్యామ్ అని కాకుండా ‘వాటర్ బాంబ్’ అని పిలుస్తున్నారు. యార్లుంగ్ సాంగ్పో (భారత్‌లో బ్రహ్మపుత్ర) నదిపై చైనా 60,000 మెగావాట్ల సామర్థ్యంతో చైనా డ్యామ్ నిర్మిస్తోంది.
చైనా ఆధీనంలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ఈ ఆనకట్ట నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ రీజియన్ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ఒకవేళ డ్యామ్ నిర్మించాక భూకంపం ఏర్పడితే భారత్, బంగ్లాదేశ్‌లపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూకంపాల కారణంగా భారీ వరదలు ఏర్పడతాయి. అందుకే మైడాగ్ డ్యామ్ భారత్‌కు వాటర్ బాంబ్‌లాగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఆనకట్ట వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
చైనా భూగర్భ శాస్త్రవేత్తలదీ అదే మాట..
మైడాగ్ డ్యామ్ విషయంలో భారతీయులు మాత్రమే ఆందోళన చెందడం లేదు. చైనా భూగర్భ శాస్త్రవేత్తలూ ఈ ఆనకట్టపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్మిస్తున్న ప్రాంతంలో టెక్టోనిక్ ఫ్రాక్చర్ ( భూమి శిలా పొరలో పగులు ఏర్పడటం) ఉన్నట్టు వారు గుర్తించారు. అందుకే ఈ డ్యామ్ భద్రత అంశంలో ఆందోళన చెందుతున్నారు.
భారత్‌కు నిజంగానే ముప్పు ఉందా..?
మైడాగ్ నిర్మాణంపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర జలాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోతాయి. చైనా జలాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి ఒకేసారి విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు ఏర్పడతాయి. మరోవైపు సమ్మర్ లాంటి సీజన్లలో చైనా అసలు జలాలనే విడుదల చేయకపోతే నీటి ఎద్దడి నెలకొంటుంది. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి భారత్ కూడా ఓ మెగా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిందని సమాచారం.
చైనా జలవిద్యుత్ ఉత్పత్తి కోసం 167 బిలియన్ డాలర్ల (దాదాపు 16 లక్షల కోట్ల) వ్యయంతో ఈ మైడాగ్ డ్యామ్‌ను నిర్మిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ ( అది కూడా చైనాలోనే ఉంది) కన్నా ఇది మూడు రెట్లు పెద్దది. 2033 నాటికి ఈ డ్యామ్ పూర్తి చేయాలని చైనా భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
150 మందిపై యూపీ ఏటీఎస్ నజర్.. పాక్ టెర్రర్ నెట్‌వర్క్‌తో లింకులపై దర్యాప్తు..
నేపాల్‌లో వరద బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మాయం.. భయానకంగా ఏరియల్ దృశ్యాలు