అరుణాచల్‌లో చైనా దురాక్రమణ!
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:24 AM
భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందన్న వార్తలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని స్థానికులేగాక స్వయంగా...
దాదాపు 60 కి.మీ.ల మేర ఆ దేశ సైన్యం చొచ్చుకొచ్చిందంటున్న స్థానికులు
తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను కోల్పోతున్నామని ఆవేదన
అధికార బీజేపీ మిత్రపక్షం అధ్యయనంలో ఆక్రమణ నిజమేనని నిర్ధారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందన్న వార్తలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని స్థానికులేగాక స్వయంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షమైన ‘అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ’ చెబుతుండగా.. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మాత్రం అలాంటిదేమీ లేదని పాతమాటనే పునరుద్ఘాటిస్తున్నారు. ఇంతకూ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న ఆసక్తి నెలకొంది. బీజేపీ సారథ్యంలోని నార్త్‌ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్‌లో కీలక భాగస్వామి అయిన అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ ఇటీవల నలుగురు సభ్యులతో ఓ నిజ నిర్ధారణ బృందాన్ని నియమించింది. ఈ బృందం రాష్ట్రంలోని మారుమూలప్రాంతాల్లో పర్యటించి, చైనా దురాక్రమణ నిజమేనా అన్నదానిపై అధ్యయనం జరిపింది. దీంట్లో వెల్లడైన అంశాలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కలింగ్ జెరాంగ్ వెల్లడించారు. 2023లో చైనాతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అనంతరం ‘షెరా 5’ అనే పెట్రోలింగ్ పాయింట్‌ను భారత సైన్యం పూర్తిగా వదిలేసిందని స్థానికులు తెలియజేశారని జెరాంగ్ పేర్కొన్నారు. చైనా దురాక్రమణ కారణంగా.. తరతరాలుగా తాము వేట కోసం వినియోగిస్తున్న భూములను కోల్పోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఆక్రమణలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావని, ఏళ్లుగా ఓ క్రమపద్ధతిలో జరుగుతున్నాయని, వీటిని కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. నాహ్ సంక్షేమ సంఘం కూడా గత నెల.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. చైనా ఆక్రమణ అంతకంతకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, చైనా అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా 60 కి.మీ.ల మేర ప్రాంతాన్ని ఆక్రమించిందని, ప్రధానంగా ఎగువ సుబన్‌సిరి జిల్లాలో ఈ ఆక్రమణలు చోటుచేసుకున్నాయని వార్తలు వెలువడ్డాయి.
గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే: రిజిజు
భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని అరుణాచల్ ప్రదేశ్‌కే చెందిన కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుపై స్పష్టత కొరవడినందునే, ‘చైనా దురాక్రమణ’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలను భారత ప్రభుత్వం నిర్మించలేదని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. మరోవైపు, చైనా కూడా ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది. గత వారం చైనా-భారత్ సరిహద్దు వ్యవహారాల 36వ సమావేశంలో చైనా విదేశాంగ ప్రతినిధి గువ్ జియ్‌కున్ మాట్లాడుతూ ఇరుదేశాల సరిహద్దు వద్ద స్థిరమైన పరిస్థితులే నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..