సీల్డ్ కవర్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని ఎండోస్కోపీ కెమెరాతో వీడియో తీసి లీక్
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:01 AM
ఛత్తీస్‌గఢ్‌లో అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని స్వయంగా ఓ ప్రొఫెసరే లీక్ చేశాడు. ప్రశ్నపత్రాలను సీల్ చేసిన కవర్‌కు సన్నటి రంధ్రం చేసి.. అందులోకి ఎండోస్కోపిక్...
ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రొఫెసర్ చర్య..పరీక్ష రద్దు.. ప్రొఫెసర్ అరెస్టు
రాయ్‌పూర్, ఆగస్టు 22: ఛత్తీస్‌గఢ్‌లో అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని స్వయంగా ఓ ప్రొఫెసరే లీక్ చేశాడు. ప్రశ్నపత్రాలను సీల్ చేసిన కవర్‌కు సన్నటి రంధ్రం చేసి.. అందులోకి ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి క్వశ్చన్ పేపర్‌ను వీడియో తీశాడు. దానిని ఓ విద్యార్థికి విక్రయించగా.. అతడు మరికొందరు విద్యార్థులకు షేర్ చేశాడు. ఈ నెల 20న ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ(ఐజీకేవీ) అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఎంటమాలజీ పరీక్ష పేపర్ విషయంలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూనివర్సిటీ పరిధిలోని 28 అనుబంధ కాలేజీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. ఉదయం 8.41 గంటలకు పేపర్ లీకైందంటూ కవర్ధాలోని అగ్రికల్చర్ కాలేజీ అధికారులకు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో పరీక్షను నిలిపివేశారు. పోలీసులు దర్యాప్తు జరపగా.. దుర్గ్ పట్టణంలోని భారతి అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న యోగేశ్(38) ఈ లీకేజీకి పాల్పడ్డట్లు తేలింది. అతడు భారతి కాలేజీలో నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాలను రాయ్‌పూర్‌లోని కాలేజీకి తీసుకెళ్లి అక్కడ డిపాజిట్ చేయడం, అక్కడి నుంచి ప్రశ్నపత్రాలను తమ కాలేజీకి తీసుకెళ్లడం చేసేవాడు. తాజాగా లీకైన ప్రశ్నపత్రాలను తమ కాలేజీకి తీసుకెళ్లి యోగేశ్.. వాటిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్లి ఎండోస్కోపిక్ కెమెరాతో వీడియో తీశాడు. ఆ పేపర్‌ను ఓ విద్యార్థికి రూ.11 వేలకు విక్రయించగా.. అతడు మరికొందరికి చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రొఫెసర్ యోగేశ్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్