లీక్‌పై చర్చకు సిద్ధం: కేంద్రం
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:46 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని బుధవారం వెల్లడించింది. వీధుల్లో నిరసన...
న్యూఢిల్లీ, జూలై 22: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని బుధవారం వెల్లడించింది. వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని ప్రతిపక్షాలకు స్పష్టం చేసింది. బుధవారం ఉదయం వాయిదా అనంతరం లోక్‌సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా నీట్ పేపర్ లీకేజీపై ఓ ప్రకటన చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు. పేపర్ లీకేజీ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రిజిజు ప్రకటించారు. అయితే, ఏ నిబంధన కింద ఈ అంశంపై చర్చ చేపట్టాలనేది నిర్ణయించడంతోపాటు తేదీ, సమయాన్ని ఖరారు చేయడానికి అన్ని పార్టీల సభాపక్ష నేతలతో స్పీకర్ సమావేశం కావాలని కోరారు. అదేసమయంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. పార్లమెంటులో ఇతర అంశాలన్నింటినీ పక్కనపెట్టి, దీనిపైనే ప్రధానంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
కాగా, సభ వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రి రిజిజు విలేకరులతో మాట్లాడారు. సున్నితమైన ఈ అంశంపై పార్లమెంటులో చర్చించకుండా ప్రతిపక్షాలు రోడ్లెక్కి రచ్చచేయడం సరికాదన్నారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది. ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్ ఘటనను ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. విద్యార్థుల సమస్యలను ఏ పార్టీ కూడా రాజకీయం చేయవద్దని సూచించారు.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి