పారాక్వాట్‌పై నిషేధం!
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:16 AM
విరుగుడు లేని విషంగా పేరొందిన గడ్డి మందు ‘పారాక్వాట్’పై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంగళవారం...
గడ్డిమందుపై పూర్తి నిషేధాన్ని ప్రతిపాదిస్తూ
ముసాయిదా ఉత్తర్వు జారీ చేసిన కేంద్రం
అభ్యంతరాలు, సూచనలకు 30 రోజుల గడువు
తుది ఉత్తర్వు వస్తే.. దాని తయారీ, అమ్మకాలు,
రవాణా, పంపిణీ, వినియోగం అన్నీ చట్టవిరుద్ధమే
ఇప్పటికే ఈ మందుపై 70కి పైగా దేశాల్లో నిషేధం
న్యూఢిల్లీ, జూలై 14: విరుగుడు లేని విషంగా పేరొందిన గడ్డి మందు ‘పారాక్వాట్’పై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంగళవారం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ముసాయిదా ఉత్తర్వుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను సమర్పించడానికి 30 రోజుల గడువిచ్చింది. పారాక్వాట్‌ను తాగి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని, దీనిపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని వైద్యులు, వ్యవసాయనిపుణులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పురుగుమందుల చట్టం, 1968’లోని సెక్షన్ 27 ప్రకారం.. పారాక్వాట్ దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలపైన, రవాణా, పంపిణీ, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వు జారీ చేసింది. తుది ఉత్తర్వు విడుదలైతే.. పారాక్వాట్ తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగం చట్టవిరుద్ధం అవుతాయి. కొద్దిమోతాదులో శరీరంలోకి ప్రవేశించినా ప్రాణాలు తీసే పారాక్వాట్‌ను ప్రపంచంలో ఇప్పటికే 70కి పైగా దేశాలు పూర్తిగా నిషేధించాయి. వ్యవసాయంలో వాడే రసాయనాలన్నింటిలోకీ అత్యంత ప్రాణాంతకమైన రసాయనం.. పారాక్వాట్! ఇది సాధారణ కలుపు నాశిని కాదు. దీనికి ఎలాంటి యాంటీడోట్ (విరుగుడూ) లేదు. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించినా ప్రాణాంతకమే. శరీరంలోకి ప్రవేశించగానే ఊపరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెత్తగా స్పాంజిలా ఉండాల్సిన ఊపిరితిత్తులు దీని ప్రభావంతో శాశ్వతంగా గట్టిబడిపోతాయి. ఈ మందు మూత్రపిండాలు, కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా పొలాల్లో ఈ మందు జల్లితే.. చర్మంపైన, కళ్లపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఎక్కువకాలం ఈ మందు కొట్టినవారు పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనదేశంలో కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ వినియోగాన్ని ఇప్పటికే నియంత్రించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!