Share News

పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌పై మళ్లీ కసరత్తు

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:33 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులపై కసరత్తును కేంద్రం మళ్లీ ముమ్మరం చేసింది. ఈ నెల 13వ తేదీతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు...

పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌పై మళ్లీ కసరత్తు

  • విపక్షాలతో కేంద్రప్రభుత్వం సంప్రదింపులు

  • రాహుల్‌గాంధీతో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు భేటీ

  • బిల్లుల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి

  • రామాలయం విరాళాల చోరీ, విద్యార్థులపై

  • లాఠీచార్జి అంశాల మీద చర్చకు రాహుల్‌ పట్టు

  • షాను కలిసి రాహుల్‌ వైఖరిని వివరించిన రిజిజు

  • అఖిలేశ్‌, స్టాలిన్‌ మద్దతుకు కేంద్రం యత్నాలు

  • ఈ నెల 13వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు

  • ఆలోపే 2/3 మెజారిటీ సాధనకు యత్నాలు

  • 16-18 మధ్య పార్లమెంటు ప్రత్యేక

  • సమావేశాలంటూ వార్తలు.. తోసిపుచ్చిన రిజిజు

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులపై కసరత్తును కేంద్రం మళ్లీ ముమ్మరం చేసింది. ఈ నెల 13వ తేదీతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియనున్న దృష్ట్యా ప్రయత్నాలు వేగవంతం చేసింది. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో వాయిదా పడింది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు నేరుగా విపక్షనేత రాహుల్‌ గాంధీ చాంబర్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులను సభలో ఆమోదింపజేసుకునేందుకు సహకరించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తిని రాహుల్‌ గాంధీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల చోరీపై ఉభయసభల్లో చర్చను తక్షణమే చేపట్టాలని, గత నెల 20వ తేదీన ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసులు జరిపిన లాఠీచార్జిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేయాలంటూ తాము చేస్తున్న డిమాండ్లను అంగీకరించేవరకూ ప్రభుత్వానికి సహకరించేది లేదని రాహుల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌, గౌరవ్‌ గొగోయ్‌ కూడా పాల్గొన్నారు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం కిరణ్‌ రిజిజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్‌ షాను కలిసి రాహుల్‌ గాంధీ వైఖరిని వారికి తెలియజేసినట్లు సమాచారం. గత 10 రోజుల్లో రాహుల్‌తో రిజిజు సమావేశం కావటం ఇది రెండోసారి. మంగళవారం రాత్రి కూడా రాహుల్‌కు కిరణ్‌ రిజిజు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌తో కూడా ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న భయాందోళనల నేపథ్యంలో.. జనాభాతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రంలో లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచాలన్న క్లాజును ఈసారి బిల్లులో చేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వనున్నట్లు సమాచారం.


మెజారిటీపై దృష్టి.. డీఎంకే మద్దతుపై గురి

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలంటే లోక్‌సభలో 360 మంది, రాజ్యసభలో 164 మంది ఎంపీల మద్దతు (2/3 వంతుల మెజారిటీ) తప్పనిసరి. ఇటీవల ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అనుకూలంగా 298 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేశారు. అయితే, ఇటీవల పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తదనంతర పరిణామాలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలువునా చీలి పలువురు ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరిన విషయం తెలిసిందే. శివసేన(ఉద్ధవ్‌) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు సైతం ఏక్‌నాథ్‌షిండే సారథ్యంలోని శివసేనలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం ఎన్డీఏ బలం దాదాపుగా 320 వద్దకు చేరుకుంది. అయినప్పటికీ, మూడింట రెండొంతుల మెజారిటీ మార్కు(360) సమకూరలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విపక్షాలను కూడా బుజ్జగించే పనిలో పడింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయ్‌ పార్టీ టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతివ్వటంతో ఇండియా కూటమి నుంచి డీఎంకే వైదొలిగింది. దీంతో ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీల మద్దతు సాధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. అయితే, ఇండియా కూటమికి దూరం జరిగినప్పటికీ.. ఎన్డీఏకు డీఎంకే దగ్గరవుతుందా అన్నది సందేహమే.

ప్రత్యేక సమావేశాలు లేవంటూ మంత్రి ప్రకటన

రాహుల్‌తో కిరణ్‌ రిజిజు భేటీ నేపథ్యంలో.. బుధవారం ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సమావేశాలలోపే బిల్లులను ఆమోదింపజేసుకునే మెజారిటీ సమకూరకపోతే.. ఈ నెల 16-18 తేదీల మధ్య పార్లమెంటును మరోసారి ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, బుధవారం రాత్రి కిరణ్‌ రిజిజు దీనిపై స్పష్టతనిచ్చారు. మహిళా, డీలిమిటేషన్‌ బిల్లులపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ వర్గాలు సైతం.. ప్రస్తుత సమావేశాలు మరో వారం పాటు కొనసాగనున్న దృష్ట్యా.. బిల్లులను తీసుకొస్తే ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం తీసుకొస్తుందని పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:33 AM