30 రోజుల ఎల్‌పీజీ నిల్వలు.. ఓఎంసీలకు కేంద్రం ఆదేశాలు
ABN , Publish Date - May 29 , 2026 | 09:38 PM
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా వంట గ్యాస్ కొరత రాకుండా తప్పనిసరిగా 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు(OMCs) కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. దేశీయంగా వంట గ్యాస్ కొరత రాకుండా తప్పనిసరిగా 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. దీనిపై ఓఎంసీలు కసరత్తు చేస్తున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ శుక్రవారంనాడు తెలిపారు. క్రూడాయిల్ నిల్వలను విస్తరించాలని కూడా ఓఎంఎస్‌లను కోరినట్టు చెప్పారు.
'దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయి. ముడి చమురు, సహజవాయువు సరఫరాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. రిఫైనరీలన్నీ గరిష్ఠ స్థాయిలో ఆపరేట్ అవుతున్నాయి. ఎల్‌పీజీ ఉత్పత్తి ఆల్‌టైమ్ హైరికార్డుతో రోజుకు 92 టీఎంటీ చొప్పున ఉత్పత్తి చేస్తున్నాయి' అని సుజాత శర్మ తెలిపారు.
దేశానికి అవసరమయ్యే ఎల్పీజీలో 60 శాతం వంటగ్యాస్‌ను ఇతర దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ దిగుమతుల్లో 90 శాతం గ్యాస్ హోర్ముజ్ జలసంధి మార్గం గుండానే భారత్ తీరానికి చేరుకోవాల్సి ఉంది. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి గ్యాస్ సరఫరా దెబ్బతినడంతో వినియోగదారులకు సరఫరాను కూడా తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. రీఫిల్ బుకింగ్‌ల మధ్య కనీస కాలవ్యవధిని పెంచింది. ఇదే సమయంలో రిఫైనరీలను కూడా అప్రమత్తం చేసింది. గరిష్ఠ స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తికి ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఎల్పీజీ డిమాండ్ సుమారు 72,000 టన్నులు కాగా, దేశీయ రిఫైనరీలు రోజుకు 50,000 నుంచి 52,000 టన్నుల మేర ఎల్పీజీ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది 70 శాతం అవసరాలు తీరుస్తోంది.
ఇవి కూడా చదవండి..
పంజాబ్ స్థానిక ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం.. అత్యధిక స్థానాలు కైవసం
రాజకీయ నేపథ్యం ఉన్నా రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు