Share News

నీట్‌, జేఈఈలో ఇంటర్‌ మార్కులకు 50 శాతం వెయిటేజీ!

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:23 AM

తరచూ పేపర్‌ లీకేజీలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్‌, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశపరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చే...

నీట్‌, జేఈఈలో ఇంటర్‌ మార్కులకు 50 శాతం వెయిటేజీ!

వివాదాల నేపథ్యంలో కేంద్రం యోచన

బోర్డు పరీక్షల మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం, కోచింగ్‌ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించేలా చర్యలు

క్రమంగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల విధానం అమలు

కీలక సంస్కరణలతో నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం!

న్యూఢిల్లీ, జూలై 2: తరచూ పేపర్‌ లీకేజీలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్‌, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశపరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చే మార్కులతోపాటు ఇంటర్మీడియట్‌, సీబీఎ్‌సఈ 12వ తరగతి తదితర బోర్డు పరీక్షల మార్కులకు 50శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రవేశపరీక్షల్లో పారదర్శకత పెంచడం, విద్యార్థులు కోచింగ్‌ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, బోర్డు పరీక్షలకు ప్రాధాన్యత లభించేలా చూడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల నీట్‌ ప్రశ్నపత్రం లీకవడం, పరీక్షను తిరిగి నిర్వహించడం తెలిసిందే. సుమారు 20 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నీట్‌, జేఈఈ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విధానం, నిర్వహణలో సంస్కరణలు అవసరమనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై 9 మందితో నిపుణుల కమిటీ వేసింది. ప్రవేశ పరీక్షల ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియడ్‌, సీబీఎ్‌సఈ తదితర బోర్డు పరీక్షల మార్కులకు వెయిటేజీ ఇచ్చే అంశాన్ని ఆ కమిటీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే వైద్య విద్య, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అందులో బోర్డు పరీక్షల మార్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదు. దీనితో విద్యార్థుల్లో చాలా మంది ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనంతటినీ సరిదిద్దే దిశగా సంస్కరణలు తెచ్చే ప్రతిపాదన ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.


‘‘కోచింగ్‌ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, పాఠశాల స్థాయిలోని సిలబ్‌సకు అనుగుణంగా ప్రవేశపరీక్షలను మార్చడం, క్రమంగా కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ) విధానంవైపు మళ్లడం లక్ష్యంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వైద్య విద్య, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ర్యాంకుల నిర్ధారణలో బోర్డు పరీక్షల మార్కులకు 50శాతం వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా, నిపుణుల కమిటీ మరికొన్ని వారాల్లో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం సంస్కరణలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 06:23 AM