కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకుదీపావళి కానుక
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:13 AM
దేశంలో పంచాయతీల స్వయం సమృద్థి, తయారీ రంగానికి ప్రోత్సాహం, ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది
డీఏ 3శాతం పెంపు.. పెన్షనర్లకు ఇంతే మేర డీఆర్
జూలై 1 నుంచి అమలు.. ఖజానాపై రూ.10,016 కోట్ల భారం
గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ.7,395 కోట్లు
క్రీడా సామగ్రి, కంటెయినర్ల తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం
నాలుగు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కేంద్ర ఉద్యోగులకు డీఏ 3శాతం పెంపు
జూలై 1 నుంచి అమలు.. ప్రభుత్వ ఖజానాపై రూ.10,016 కోట్ల భారం
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో పంచాయతీల స్వయం సమృద్థి, తయారీ రంగానికి ప్రోత్సాహం, ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి ముందు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు 3శాతం మేర కరువు ఉపశమనం (డీఆర్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూలై నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ 63 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పింఛనుదారులు (మొత్తం 1.17 కోట్ల మంది) లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.10,016 కోట్ల భారం పడనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.7,395 కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన’ పథకం అమలు చేయనుంది. అలాగే, రూ.10వేల కోట్లతో కంటెయినర్ల తయారీ ప్రోత్సాహక పథకం, రూ.1,857 కోట్లతో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ (క్రీడా సామగ్రి) తయారీ పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది.
‘ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’ పథకంలో కేంద్రం తన వాటా కింద రూ.4,869 కోట్లు ఇవ్వనుండగా, రాష్ట్రాలు రూ.2,526 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయనున్నారు. ఇదిలా ఉండగా, దేశీయంగా సరుకు రవాణా కంటెయినర్ల తయారీని పెద్ద ఎత్తున పెంచేందుకు రూ.10వేల కోట్లతో ‘కంటెయినర్ మాన్యుఫాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్’ను (సీఎంపీఎస్) అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి