Share News

పారాక్వాట్‌ గడ్డిమందు పూర్తిగా నిషేధం!

ABN , Publish Date - May 08 , 2026 | 04:25 AM

ప్రాణానికి హాని కలిగించే ప్రమాదకరమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ అనే గడ్డిమందును దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది....

పారాక్వాట్‌ గడ్డిమందు పూర్తిగా నిషేధం!

  • ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచన

న్యూఢిల్లీ, మే 7: ప్రాణానికి హాని కలిగించే ప్రమాదకరమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ అనే గడ్డిమందును దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీ ఈ రసాయనాన్ని పూర్తిగా నిషేధించాలని సిఫారసు చేయడంతో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పత్తి, వరి, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు రైతులు ఈ గడ్డిమందును వినియోగిస్తారు. తక్కువ ధరకే లభించడం, సత్వరంగా ఫలితాలనివ్వడం వల్ల దీనికి డిమాండ్‌ పెరిగింది. విషపూరితమైన ఈ గడ్డిమందును ఉపయోగించడం వల్ల వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదముందని, కిడ్నీలు ఉపిరితిత్తులు, కాలేయం దెబ్బతినడం, పార్కిన్సన్‌ వ్యాధి వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోనూ ఈ గడ్డిమందు ప్రభావం వల్ల నెలకు కనీసం 20 మందికిపైగా రైతులు, కూలీలు మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 200 మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 2026, ఏప్రిల్‌ 1 నుంచి 60 రోజులపాటు ఈ గడ్డిమందు అమ్మకాలు, వినియోగం, నిల్వపై నిషేధం విధించింది. ఈ మేరకు మార్చి 30న అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2003లో ఒరిసాలోనూ ఈ గడ్డిమందుపై తాత్కాలిక నిషేధం విధించగా.. కేరళం ఆ దిశగా ప్రయత్నించగా కోర్టుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. రాష్ట్రాలకు శాశ్వత నిషేధాధికారం లేనందున కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధిస్తే ప్రత్యామ్నాయ కలుపు నివారణ మందుల ధరలు 2 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కూలీలతో కలుపు తీయించాల్సి వస్తే సాగు ఖర్చు వంద రెట్లు పెరగొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ గడ్డిమందును నిషేధించిన సమయంలో దొంగచాటుగా ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి గడ్డిమందును స్మగ్లింగ్‌ చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 04:25 AM