వచ్చేనెల 1 నుంచి కాలర్ ఐడీ సదుపాయం
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:47 AM
కాలర్ ఐడీ సదుపాయాన్ని నవంబరు 1 నుంచి తప్పనిసరి చేస్తూ టెలీ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ(డాట్) ఉత్తర్వులు జారీ చేసింది. కాల్ చేసిన వ్యక్తి పేరు ఆయా టెలికాం ఆపరేటర్ల వద్ద నమోదైన ప్రకారం కాల్ అందుకునే వ్యక్తి ఫోన్లో డిస్ప్లే అవుతుంది.
న్యూఢిల్లీ, అక్టోబరు 15: కాలర్ ఐడీ సదుపాయాన్ని నవంబరు 1 నుంచి తప్పనిసరి చేస్తూ టెలీ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ(డాట్) ఉత్తర్వులు జారీ చేసింది. కాల్ చేసిన వ్యక్తి పేరు ఆయా టెలికాం ఆపరేటర్ల వద్ద నమోదైన ప్రకారం కాల్ అందుకునే వ్యక్తి ఫోన్లో డిస్ప్లే అవుతుంది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా పూర్తి ఉచితంగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనివల్ల స్పామ్ కాల్స్ బెడద తప్పుతుందని డాట్ భావిస్తోంది. అక్టోబరు 13న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ‘‘ఈ సౌకర్యం ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలవుతోంది. 4జీ, 5జీ నెట్వర్క్లలో మాత్రమే ప్రస్తుతానికి ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’(సీఎన్ఏపీ) సదుపాయం అందుబాటులో ఉంటుంది.
మన ఫోన్లో సేవ్ కాని నంబరు నుంచి కాల్ వచ్చినప్పుడు నంబరుతో పాటు పేరుకూడా డిస్ప్లే అవుతుంది. కాల్ పూర్తి అయిన తరువాత దానిని పేరుతో సహా ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసుకుని సేవ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. అయితే సీఎన్ఏపీ రిస్ట్రిక్షన్ సదుపాయాన్ని వినియోగదారుడు ఎంచుకుంటే మాత్రం నంబరుతో పేరు డిస్ప్లే కాదు. విదేశాల నుంచి వచ్చే కాల్స్కు ‘ఇంటర్నేషనల్ కాల్’ అని కనిపిస్తుంది. బల్క్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారుడు ఆయా నంబర్లకు ఏ పేరు డిస్ప్లే కావాలన్నది ఎంచుకునే అవకాశం ఉంది. అయితే అందుకు అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత ఆపరేటర్కు సమర్పించాలి.’’
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు