Share News

మీ ఛాయిస్‌ ఎవరు?

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:49 AM

చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీల్లో పలువురికి గురువారం వచ్చిన కాల్‌ ఇది. అంటే టీడీపీ తరపున అభ్యర్థుల ఎంపికలో ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సాగింది. ఇప్పటిదాకా తామే ప్రధాన అభ్యర్థిగా భావించుకుంటున్న ఆశావహుల గుండెల్లో గుబులు మొదలైంది.

మీ ఛాయిస్‌ ఎవరు?

‘మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు?’

చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీల్లో పలువురికి గురువారం వచ్చిన కాల్‌ ఇది. అంటే టీడీపీ తరపున అభ్యర్థుల ఎంపికలో ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సాగింది. ఇప్పటిదాకా తామే ప్రధాన అభ్యర్థిగా భావించుకుంటున్న ఆశావహుల గుండెల్లో గుబులు మొదలైంది.

బటన్‌ నొక్కండి

కుప్పంలో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి మొదలైన ఐవీఆర్‌ఎస్‌ సర్వే

కుప్పం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికకు టీడీపీ అధిష్ఠానం గురువారం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. మొత్తం ఐదుగురు నేతలు రేసులో ఉండగా.. వీరిలో మాజీ జడ్పీటీసీ రాజ్‌ కుమార్‌, మాజీ ఎంపీపీ వెంకటేష్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ అనుకూలతలు, లక్ష్యాలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఐదుగురి దరఖాస్తులూ పార్టీవద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలువురు సామాన్య జనానికి ఐవీఆర్‌ఎస్‌ మొబైల్‌ కాల్స్‌ వచ్చాయి. ‘కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వాన్ని శారదమ్మ, వి.వెంకటేష్‌, ఎస్‌.రాజ్‌ కుమార్‌, కన్నన్‌, ప్రశాంత్‌ కోరుకుంటున్నారు. మీ అభిప్రాయం శారదమ్మ అయితే ఒకటి బటన్‌ నొక్కండి, వెంకటేష్‌ అయితే 2, రాజ్‌ కుమార్‌ అయితే 3, కన్నన్‌ అయితే 4, ప్రశాంత్‌ అయితే 5 నొక్కండనే సందేశాలు వచ్చాయి. మరికొందరికి వచ్చిన ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో రాజ్‌ కుమార్‌, వెంకటేష్‌ పేర్లే చెప్పి అభిప్రాయం కోరారు. మరికొందరికి వచ్చిన కాల్స్‌లో అభ్యర్థుల పేర్ల వరుస క్రమం మారింది. దీంతో ఈ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్థానిక నేతలు ఎవరిని సిఫార్సు చేసినా, చివరకు ఐవీఆర్‌ఎస్‌ సర్వేతోపాటు, సీఎం చంద్రబాబు పార్టీ తరఫున చేపట్టిన సర్వేలోను అత్యధిక మెజారిటీ ఓట్లు వచ్చిన వారికే అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంది. టీడీపీలో కౌన్సిలర్‌ స్థానాలను ఒకరికి మించి పలువురు ఆశిస్తున్నారు. వీలైనంత వరకు ఒక్కో వార్డునుంచి ఒక్కొక్కరే ప్రధాన అభ్యర్థిగా ఉండి, మిగిలిన వారు పోటీనుంచి తప్పుకునేలా నాయకులు బుజ్జగింపులు, మంతనాలు సాగిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించకుంటే కౌన్సిలర్‌ స్థానాలకూ ఆశావహుల పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ నేడో రేపో రావొచ్చు.

ఈ ముగ్గురిపై మీ అభిప్రాయం చెప్పండి

మేయర్‌ టీడీపీ అభ్యర్థికి ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కఠారి హేమలత, త్యాగరాజన్‌, కాజూరు ద్రాక్షాయణి పేర్లు

చిత్తూరు: చిత్తూరు మేయర్‌ రేసులో ఆశావహులు ఎక్కువమంది ఉన్నా గురువారం సాయంత్రానికి ముగ్గురే మిగిలారు. టీడీపీ అధిష్ఠానం కఠారి హేమలత, కాజూరి బాలాజీ సతీమణి ద్రాక్షాయణి, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌ పేర్లతో ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించింది. మేయర్‌ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో సీకే లావణ్య, కఠారి హేమలత, కాజూరు ద్రాక్షాయణి పేర్లు మిగిలాయి. వీరికి తోడు తమకూ అవకాశం ఇవ్వాలంటూ అశోక్‌ ఆనంద్‌యాదవ్‌, సీఆర్‌ రాజన్‌, శంకర్‌ కూడా మేయర్‌ అభ్యర్థిత్వం కోసం ఎమ్మెల్యే గురజాలను కలిసి కోరారు. బుధవారం వరకు ఎక్కడా మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌ పేరు తెరపైకి రాలేదు. కానీ, గురువారం అధిష్ఠానం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వే (ఫోన్‌ కాల్‌)లో ఆయనతో పాటు కఠారి హేమలత, ద్రాక్షాయణి పేర్లు మాత్రం ఉన్నాయి. కాగా, మేయర్‌ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో సీకే లావణ్య పోటీలో ఉన్నారు. అయితే సీకే కుటుంబానికి మేయర్‌ టికెట్‌ వద్దని, బలిజ సామాజికవర్గానికే ఇవ్వాలంటూ ఆయా వర్గీయులు నగరంలో వరుసగా నిరసనలు, ప్రెస్‌మీట్లు పెట్టారు. ఈ క్రమంలో సీకే విషయంలో పార్టీ పునరాలోచనలో పడిందా.. అందుకే ఆమె పేరు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో లేదా.. అనే చర్చ నగరంలో జరుగుతోంది. దీంతో పాటు ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ వస్తుందనే స్థానికుల ఉత్కంఠకు శుక్రవారం తెరపడే అవకాశం ఉంది.

ఫోన్‌ వస్తే నాపేరే చెప్పండి

టీడీపీలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేతో ఆశావహుల కొత్తపల్లవి

శాంతిపురం: టిక్కెట్‌ వస్తే ఓట్లకోసం ప్రచారం చేయడం చూశాం. కానీ అభ్యర్థిత్వం దక్కించుకోవడానికి, ఐవీఆర్‌ఎ్‌సలో తమకు అనుకూలంగా బటన్‌ నొక్కాలంటూ ప్రచారం చేపట్టారు శాంతిపురం మండలంలోని టీడీపీ నేతలు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీపడే ఆశావహులు ఎక్కువగా ఉంటే అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేస్తోంది. దీంతో ఆ ఫోన్‌ కాల్స్‌లో తమకు అనుకూలత వచ్చేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు. పై నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే తమ పేరుకు సూచించే నెంబరును నొక్కాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఇలా ఎవరికి వారే జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. జడ్పీటీసీ జనరల్‌ కేటాయించడంతో భాష్యం విశ్వనాథనాయుడు, విజయరామిరెడ్డి, ఉయ్యాల జయరామిరెడ్డి తదితరులు పోటీ పడతున్నారు. ఎంపీపీ బీసీ జనరల్‌ కావడంతో ఎక్కువ మందే పోటీకి ఉద్యుక్తులవుతున్నారు.

Updated Date - Oct 16 , 2026 | 01:49 AM