దియా మీర్జా ‘దీపావళి’ వీడియోపై రగడ
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:33 AM
దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న నటి దియా మీర్జా ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ముంబై, అక్టోబర్ 3: దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న నటి దియా మీర్జా ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ నేతల అభ్యంతరాల నేపథ్యంలో తొలగించిన ఆ వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను ఆదేశించింది. దీపావళి సందర్భంగా వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎంసీ ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నటీమణులు దియా మీర్జా, మాధురీ దీక్షిత్, క్రికెటర్ ఆజింక్య రహానే తదితర సెలబ్రిటీలతో ప్రచార వీడియోలు రూపొందించి, వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. దియా మీర్జా తన వీడియోలో హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ..రహదారులపై బాణసంచా కాల్చవద్దని, పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. బీఎంసీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి దియా ప్రచార వీడియోను తొలగించింది. ఈ నిర్ణయంపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు చేసిన వీడియోకి మతం రంగు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.‘‘గాలికి కులం, మతంతో సంబంధం లేదు’’ అని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!
పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ రిలీఫ్