'అది నకిలీ సమావేశం'.. రైతులతో రాహుల్ భేటీపై బీజేపీ విమర్శలు..
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:13 PM
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అది ఒక ఫేక్ మీటింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ, ఫిబ్రవరి14: నిన్న(శుక్రవారం) లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన ఈ భేటీలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రైతులతో రాహుల్ భేటీ.. నకిలీ సమావేశం అంటూ బీజేపీ నేతలు విమర్శించారు. రాహుల్ నిర్వహించిన మీటింగ్ కృత్రిమమైనది, అలానే ఆధారం లేనిదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
శనివారం 'ఎక్స్' వేదికగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వీడియోను రిలీజ్ చేశారు. 'రాహుల్ గాంధీ మరోసారి రంగస్థలం నిర్వహించాడు. ఆయన నిర్వహించిన సమావేశం అత్యంత కృత్రిమమైనదిగా ఉంది. అలాగే దీని ద్వారా నకిలీ కథనాన్ని బయటపెట్టారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు రైతులుగా నటించారు. వారితో రాహుల్ గాంధీ నకిలీ సంభాషణ నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను ప్రధాని మోదీ పూర్తిగా రక్షించినా కూడా.. అమాయకపు రైతులను తప్పు దోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ, ఆయన స్నేహితులు ఇలాంటి నకిలీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరి నిజ స్వరూపాన్ని బయటపెడతాను' అని గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని, నిజమైన రైతులను ఆందోళనకు గురి చేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
శుక్రవారం రాహుల్‌తో జరిగిన సమావేశంలో అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, పప్పు ధాన్యాల రైతుల బతుకుదెరువు.. ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఒప్పందంతో దేశంలోకి వ్యవసాయ దిగుమతులకు తలుపులు తెరుచుకుంటాయని.. ఇతర పంటలు కూడా భారత్‌లోకి ప్రవేశిస్తాయని రాహుల్ వారికి చెప్పారని కాంగ్రెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?