Share News

అరుణ, లక్ష్మణ్‌ ఔట్‌

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:00 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్‌ నబీన్‌ తన టీమ్‌ను సోమవారం ప్రక టించారు. అయితే.. ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు ఇవ్వకుండా...

అరుణ, లక్ష్మణ్‌ ఔట్‌

  • బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండిచేయి

  • ఆంధ్రప్రదేశ్‌ నేతలకు మూడు పదవులు

  • డీకే అరుణ స్థానంలో వైస్‌ ప్రెసిడెంట్‌గా

  • దగ్గుబాటి పురందేశ్వరి

  • ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా

  • లక్ష్మణ్‌ స్థానంలో అమర్‌పాల్‌ మౌర్య

  • రాంమాధవ్‌, వసుంధరా రాజే సహా

  • 13 మంది ఉపాధ్యక్షులు

  • అన్ని సెల్స్‌ సంయుక్త ఇన్‌చార్జిగా విష్ణువర్ధన్‌ రెడ్డి నియామకం

  • నబీన్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీమ్‌

  • అందులో దక్షిణాదిన ప్రాతినిధ్యం దక్కని ఏకైక రాష్ట్రం తెలంగాణ

  • త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?.. అరుణకు చాన్స్‌?

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్‌ నబీన్‌ తన టీమ్‌ను సోమవారం ప్రక టించారు. అయితే.. ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు ఇవ్వకుండా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఝలక్‌ ఇచ్చింది. దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ఈ టీమ్‌ లో అవకాశం కల్పించగా.. దక్షిణాదిన ప్రాతినిధ్యం లభించని ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. పార్టీ జాతీయ పదాధికారుల కమిటీలో తెలంగాణ ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఇదే మొదటిసారి. అదే సమయంలో ఏపీకి చెందిన ముగ్గురు నేతలకు (పురందేశ్వరి, విష్ణువర్ధన్‌ రెడ్డి, ఢిల్లీ కోటాలో రాం మాధవ్‌) పదవులు దక్కాయి. డీకే అరుణ స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. అలాగే.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్న కె.లక్ష్మణ్‌ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్‌ పాల్‌ మౌర్యను నియమించారు. ఇక.. పురందేశ్వరితోపాటు, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ సహా 13 మందిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, ప్రధాన కార్యదర్శులుగా వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌.. సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ ను యథాతథంగా కొనసాగించారు. కేంద్ర వాణిజ్యమంత్రి గోయెల్‌ను మరోసారి పార్టీ కోశాధికారిగా నియమించడంతో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంటుందా అనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక.. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ లను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉత్తరప్రదేశ్‌లో అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణ వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రంలో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హరీశ్‌ ద్వివేదికి కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో పార్టీ మాజీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌నుబీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జిగా నియమించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డికి.. అన్ని సెల్స్‌కూ సంయుక్త ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.


షాక్‌కు గురి చేసింది..

తెలంగాణను ‘గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌’గా భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో ఎవరికీ చోటు కల్పించకపోవడం రాష్ట్ర పార్టీ ముఖ్యులను విస్మయపరచింది. ‘దక్షిణాదిన కేరళం, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం, తెలంగాణాకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిరాశపరచింది. పార్టీ కోసం జీవితాలు త్యాగం చేసిన సీనియర్లు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు.. పార్టీ కోసం జాతీయ స్థాయిలో పనిచేసే అర్హత వారిలో ఒక్కరికి కూడా లేకపోయిందా? రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మా పార్టీ నాయకత్వం ఇటీవలే కొంత కఠినంగా వ్యవహరించడం ఆరంభించింది. ఇందులో భాగంగానే విభేదాలు ఉన్న ముఖ్యులతో లంచ్‌, డిన్నర్‌ సమావేశాలు జరిగాయి. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరిగిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఎంపీలు కలిసికట్టుగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నియోజకవర్గ సమస్యలను విన్నవించారు. ఇలాంటి సందర్భంలో జాతీయ పదాధికారుల కమిటీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం షాక్‌కు గురిచేసింది’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. పార్టీకి అంతగా పట్టులేని కేరళం, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి, అంతకంటే మెరుగైన కేడర్‌ ఉన్న తెలంగాణాకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగించిందని మరో ముఖ్యనేత వాపోయారు. అయితే.. కేంద్ర మంత్రి వర్గంలో డీకేఅరుణకు చోటు కల్పించేందుకే ఆమెను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాకపోతే, కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఇప్పటికే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. మోదీ టీమ్‌లో మార్పులుంటాయని చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ మార్పుల్లో భాగంగా.. ఎంపీ ఈటల రాజేందర్‌ పేరుపై కూడా చర్చజరుగుతోంది. ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరిని పార్టీ ఉపాఽధ్యక్షురాలిగా నియమించినందున.. కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు విషయంపై జరుగుతున్న చర్చకు చుక్క పెట్టినట్లయింది. ఏపీకే చెందిన రామ్‌మాధవ్‌ను ఢిల్లీ కోటా నుంచి పార్టీ ఉపాధ్యక్ష పదవిలో నియమించడంతో.. ఇక ఆ రాష్ట్రానికి బీజేపీ నుంచి కేంద్రమంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చునని, తెలుగుదేశం నుంచి మరొకరికి అవకాశం దక్కవచ్చునని చర్చ జరుగుతోంది.


40% అణగారిన వర్గాలకు..

బీజేపీ నాయకత్వం కొత్త టీమ్‌లో.. 40 శాతం మంది అణగారిన వర్గాలు, ఓబీసీలకు స్థానం కల్పించింది. 17 మంది బ్రాహ్మణులకు, 21 మంది ఇతర అగ్రవర్ణాలకు అవకాశం ఇవ్వగా.. మిగతా 22 మంది ఇతర వర్గాలకు చెందినవారు. కేరళలో పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ అంటోనీ, తమిళనాడుకు చెందిన వెంకటేశన్‌లకు పార్టీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. గతంలో ఏపీకి చెందిన సత్యకుమార్‌ యాదవ్‌ ఒక్కరే పార్టీ జాతీయ కార్యదర్శిగా దక్షిణాదికి ప్రాతినిధ్యం వహించేవారు. అలాగే.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 8మంది అగ్రనేతలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కొత్త బృందంలో ఆరుగురు 40 ఏళ్లలోపువారు కాగా.. 15మంది 40-49ఏళ్ల వారు, 50-59 ఏళ్ల మధ్య వారు 21మంది ఉన్నారు. 12మంది మహిళలకు, మైనారిటీ వర్గాలకు చెందిన ఆరుగురికి(వారిలో ఇద్దరు క్రైస్తవులు.. సిక్కు, ముస్లిం, జైన్‌, పార్శీ మతాలకు చెందినవారు ఒక్కొక్కరు) చోటు కల్పించారు. 12మంది మహిళల్లో ఆరుగురిని పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో నియమించారు. 2029 సార్వత్రిక ఎన్నికలతోపాటు.. వివిధ రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బృందాన్ని కూర్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. పార్టీ ఆఫీస్‌ బేరర్లుగా కొత్తగా నియమితులైనవారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌గా దీపక్‌ మాస్కే

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌గా చాలాకాలంగా కొనసాగుతున్న అమిత్‌ మాలవీయను.. పార్టీ కేంద్ర నాయకత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన దీపక్‌ మాస్కేను ఆయన స్థానంలో సోషల్‌ మీడియా కన్వీనర్‌గా నియమించింది. దీపక్‌ మాస్కేకు.. పార్టీ ఐటీ, సోషల్‌ మీడియా సెల్‌లో 15 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉంది. బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. పార్టీ సోషల్‌ మీడియా కో-కన్వీనర్లుగా.. ప్రీతి గాంధీ, శివానంద్‌ ద్వివేది, అలోక్‌భట్‌, అరుణ్‌యాదవ్‌ ఆయనకు సహకరించనున్నారు. దేశ రాజకీయాలపై జెన్‌ జీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ సోషల్‌ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పు జరిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.కాగా.. కొత్త టీమ్‌కు అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:00 AM