గుడి దగ్గర దారుణం.. బీజేపీ ఎమ్మెల్యేపై దుండగుల దాడి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:58 PM
హనుమాన్ ఆలయంలో పుట్టినరోజు వేడుక జరుపుకొంటున్న బీజేపీ ఎమ్మెల్యేపై ఇద్దరు దుండగులు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనపై దాడికి సైతం దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది..
ఇంటర్‌నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్ ఆలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్న ఎమ్మెల్యేపై ఇద్దరు దుండగులు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనపై దాడికి సైతం దిగారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెవాలోని మంగవాన్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రజాపతి ఆదివారం రోజున స్వామీ సూర్యానంద్ హనుమాన్ గుడికి వెళ్లారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావటంతో గుడిలో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే రింకు సింగ్, గుడ్డు అలియాస్ గదాస అనే ఇద్దరు వ్యక్తులు బైకుపై గుడి దగ్గరకు వచ్చారు. వచ్చీ రాగానే ఎమ్మెల్యేను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నించారు. భక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేయటం మొదలెట్టారు. ఆ ఇద్దరు దుండగులు.. ‘నువ్వు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నావు. ప్రజల్ని పట్టించుకోవటం లేదు. నీ పుట్టినరోజును ఇంత ఘనంగా చేసుకుంటావా? ప్రజల డబ్బును దీని కోసం వాడతావా?’ అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
అయితే, పరిస్థితి మరింత దారుణంగా మారటంతో కొందరు బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ సంఘటనపై ప్రజాపతి మాట్లాడుతూ.. ‘మా పార్టీ వాళ్లు సరైన సమయంలో వారిని పట్టుకున్నారు. లేదంటే ఆ దుండగులు నా మీద దారుణానికి పాల్పడేవారు. రింకు, గుడ్డులు తరచూ నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు కూడా ఉన్నాయి. వారి క్రిమినల్ రికార్డులు చెక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాను ’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ
ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..