Share News

బీజేపీ ప్రభంజనం

ABN , Publish Date - May 05 , 2026 | 04:46 AM

గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘గంగా నది బిహార్‌ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో విజయం సాధించాం...

బీజేపీ ప్రభంజనం

  • పశ్చిమ బెంగాల్‌లో కమలం హవా

కోల్‌కతా, మే 4: గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘గంగా నది బిహార్‌ మీదుగా బెంగాల్‌కు ప్రవహిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో విజయం సాధించాం.. తదుపరి లక్ష్యం బెంగాల్‌ అని మోదీ ఈ విధంగా పరోక్షంగా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ను హస్తగతం చేసుకోవటం బీజేపీ చిరకాల స్వప్నం. ఇప్పుడిది సాకారమైంది. 294 సీట్ల అసెంబ్లీలో కనీస మెజారిటీకి 148 సీట్లు అవసరం కాగా, బీజేపీ 206 సీట్లు గెల్చుకుని కాషాయ పతాకాన్ని రెపరెపలాడించింది. వరుసగా మూడు పర్యాయాలు, నిరవధికంగా 15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 81 స్థానాలకు పరిమితమైపోయింది. కాంగ్రెస్‌కు, వామపక్షాలకు, ఇతరులకు రెండు చొప్పున స్థానాలు లభించాయి. భవానీపూర్‌ నియోజకవర్గంలో మమతపై బీజేపీ కీలక నేత సువేందు అధికారి 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విధంగా మమత అధికారాన్ని కోల్పోవటమేగాక అవమానాన్నీ ఎదుర్కొన్నారు. ఇది హిందుత్వకు లభించిన విజయమని, మమతకు ముస్లింలు ఓటు వేస్తే.. తనకు హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు ఓటు వేశారని సువేందు పేర్కొన్నారు. ఈ ఓటమితో రాజకీయ జీవితం నుంచి మమత రిటైర్‌మెంట్‌ తీసుకుంటారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతనుఓడించారు.

నాపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు: మమత

భవానీపూర్‌ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి తృణమూల్‌ పార్టీ ఏజెంటును బయటకు పంపించారన్న వార్తలతో మమత అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో సువేందు అధికారి కూడా అక్కడే ఉన్నారు. ఫలితం వెల్లడైన తర్వాత మమత బయటకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘కౌంటింగ్‌ సెంటర్లలోకి మా పార్టీ ఏజెంట్లను అనుమతించలేదు. సీసీటీవీ కెమెరాలు నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మా కార్యకర్తల మీద దాడులు కొనసాగించారు. నన్ను కూడా కొట్టారు. బీజేపీది అనైతిక విజయం’ అని మమత మండిపడ్డారు. కాగా, మమత మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని తృణమూల్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ కూడా పేర్కొన్నారు.

3.jpg

4.jpg


రాష్ట్రమంతటా బీజేపీ హవా

ఉత్తర బెంగాల్‌ నుంచి జంగల్‌ మహల్‌ వరకూ, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ అన్ని చోట్లా బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తృణమూల్‌ మాత్రం కోల్‌కతాలోని కొన్ని నియోజకవర్గాలు, సింగూర్‌, రైనా, జమాల్‌పూర్‌ తదితర గ్రామీణ ప్రాంతాల్లో ఆధిక్యాన్ని చూపింది. బీజేపీ ప్రభంజనంలో పలువురు తృణమూల్‌ సీనియర్‌ నేతలు, 20 మంది మంత్రులు ఓడిపోయారు. నందిగ్రాం నుంచి మరోసారి బరిలోకి దిగిన సువేందు అక్కడ కూడా విజయం సాధించారు. తృణమూల్‌ నుంచి బహిష్కరణకు గురై, ‘ఆమ్‌ జనతా ఉన్నయన్‌ పార్టీ’ పేరుతో సొంతపార్టీ స్థాపించిన హుమాయున్‌ కబీర్‌.. పోటీ చేసిన రెండు స్థానాల (నవడా, రెజినగర్‌) నుంచి గెలిచారు. మొత్తంగా బీజేపీ 45 శాతం ఓట్లను సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 38 శాతంతో పోల్చితే ఇది ఏడు శాతం అధికం. నాటి ఎన్నికల్లో 48 శాతం ఓట్లు తెచ్చుకున్న తృణమూల్‌ ఈసారి 40.94 శాతానికి పరిమితమైంది.

1.jpg

అవినీతి అంతం.. అభివృద్ధి మంత్రం

  • పక్కా వ్యూహంతో బీజేపీ పాగా

బెంగాల్‌లో అధికారం కోసం బీజేపీ సుదీర్ఘమైన పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. బంగ్లాదేశ్‌ వలసదారుల సమస్యను లేవనెత్తుతూనే రాష్ట్రం వెనుకబడటానికి 50 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లే కారణమని ప్రజలు నమ్మేలా ప్రచారం చేసింది. ఒక్కో అడుగు ముందుకేస్తూ క్షేత్రస్థాయిలో మహిళలు, యువత, కొత్త ఓటర్లు, కార్మికులను తనవైపునకు తిప్పుకుంది. కార్మికులు, డార్జిలింగ్‌ వంటి కొండప్రాంతాల్లోని తేయాకు కార్మికుల్లో మంచి ఆదరణ సంపాదించింది. ఇందుకోసం బీజేపీ అగ్రనాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు నిబద్ధతతో కష్టపడి పనిచేశారు. మమత పాలనలో మితిమీరిన అవినీతి, హింస కూడా ప్రజలు బీజేపీవైపు మొగ్గటానికి కారణమైంది. అర్బన్‌ పార్టీ అని పేరున్న బీజేపీ.. బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలంగా పాతుకుపోయింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో పరిశ్రమలు తెస్తామని కాషాయ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. పార్టీ నిర్మాణ పరంగానూబీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. టీఎంసీలో ఏక వ్యక్తి విధానం పాతుకుపోగా, బీజేపీ బూత్‌ స్థాయి నుంచి బలపడుతూ వచ్చింది. బీజేపీ నేతలు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓట్లడి గే వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. దీంతో బెంగాలీలు ఆ పార్టీకి బంపర్‌ మెజారిటీ కట్టబెట్టారు.


యూపీ మోడలా? అస్సాం మోడలా?

  • బెంగాల్‌లో బీజేపీ పాలనపై చర్చ

బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. అయితే, మతపరంగా సున్నితమైన ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్‌లో ముస్లిం జనాభా దాదాపు 25 శాతం ఉంది. అంటే 2.41 కోట్లకుపైగా ఉన్నారు. ప్రస్తుతం వారి జనాభా మరింత పెరిగింది. రాష్ట్రంలో మత హింసపై బీజేపీ ఎంతోకాలంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు కాపాడుతామని ప్రచారం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘవిద్రోహ శక్తులను, అల్లర్లు సృష్టించేవారిని కఠినంగా అణచివేసింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచింది. దీంతో ప్రస్తుతం యూపీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అస్సాంలో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధించి అధికారంలో కొనసాగబోతోంది. ఇక్కడ బీజేపీ సీఎం హేమంత బిశ్వశర్మ ముస్లిం వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ముస్లింలు 35 శాతం ఉన్నప్పటికీ వారి ఓట్లు తనకు అవసరం లేదని ప్రకటించారు. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ విధానం యూపీ మోడల్‌లో ఉంటుందా? అస్సాం మోడల్‌లో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.బెంగాల్‌లోని బంగ్లా అక్రమ వలసదారులను వెనక్కి పంపుదామంటే సీఎం మమతా బెనర్జీ సహకరించటం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అనేకసార్లు విమర్శించారు. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో వారి ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి వారిని వెనక్కి పంపే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో తాత్కాలికంగానైనా అలజడి రేగటం ఖాయమని భావిస్తున్నారు.


జీరో నుంచి హీరో వరకు..

  • ఫలించిన నాలుగున్నర దశాబ్దాల పోరాటం

బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ నాలుగున్నర దశాబ్దాలపాటు పోరాటం చేసి ఎట్టకేలకు లక్ష్యం సాధించింది. 1982 నుంచి బెంగాల్‌లో బీజేపీ పోటీచే స్తూ వస్తోంది. అయినాబెంగాలీలు బీజేపీని కనీసం పట్టించుకోలేదు. అయినా, ఎక్కడా నిరాశ చెందకుండా ఆ పార్టీ సుదీర్ఘ పోరాటం, పక్కా వ్యూహంతో గెలుపు తలుపు తట్టింది. నిజానికి బీజేపీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్‌ (బీజేఎస్‌) వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బెంగాల్‌కు చెందినవారే. ఆర్‌ఎ్‌సఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ కోల్‌కతాలోనే చదువుకున్నారు. అయినా మొదట్లో ఆ పార్టీకి బెంగాల్లో పెద్దగా ఆదరణ లభించలేదు. 1982లో మొదటిసారి ఆ పార్టీ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసింది. అయినా ఒక్క సీటు కూడా గెలవలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 9 సీట్లలో పోటీచేసి 0.4 శాతం ఓట్లు సాధించింది. 1987 అసెంబ్లీ ఎన్నికలు, 1989 లోక్‌సభ ఎన్నికలు, 1991, 1996 ఎన్నికల్లోనూ అదే చేదు అనుభవం ఎదురైంది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తొలిసారి ఖాతా తెరిచింది. డుమ్‌డుమ్‌ స్థానం నుంచి ఆ పార్టీ తపన్‌ సిక్దర్‌ గెలుపొందారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీతో జట్టుకట్టి 2 ఎంపీ సీట్లు గెలిచింది. 2001లోనూ గెలుపు సొంతం చేసుకోలేదు. 2004 సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమిని ఏర్పాటు చేసి టీఎంసీతో కలిసి పోటీచేసినా ఫలితం మారలేదు. టీఎంసీ కూడా ఒక్క ఎంపీ సీటుకే పరిమితమైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుతో డార్జిలింగ్‌ లో గెలుపొందింది. 2014లో జీజేఎంతో కలిసి పోటీచేసి 2 ఎంపీ సీట్లు గెలిచింది. 2016లో 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచి తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టింది. 2019 సాఽర్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

Updated Date - May 05 , 2026 | 04:47 AM