ఢిల్లీలో హీటెక్కిన రాజకీయం.. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:54 PM
ఢిల్లీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్‌లో పోటాపోటీ నిరసనలకు తెరతీసి నగర వీధులు దద్దరిల్లేలా చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలకు తెరతీసి నగర వీధులు దద్దరిల్లేలా చేశాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి పార్టీలు ఓట్ చోరీ మార్చ్ నిర్వహించాయి. మరోవైపు, కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల సంస్మరణార్థంగా మరో ర్యాలీకి నిర్వహించింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంలో ఇండి కూటమి పార్టీలు ఛలో ఢిల్లీ ర్యాలీలో పాల్గొన్నాయి. రామ్‌లీలా మైదానం వరకూ నిర్వహించాయి. నారీ నగర్ బస్‌స్టాప్ నుంచి తిలక్ నగర్ వరకూ బీజేపీ ర్యాలీ నిర్వహించింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల కోసం ఉద్దేశించిన రోజున కాంగ్రెస్ తన పొలిటల్ ప్రోగ్రామ్ ప్రారంభించిందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతిపక్షాల మార్చ్ మధ్యాహ్నం మింటో రోడ్-కాన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ప్రారంభమైంది. సర్ కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన లోపాలను సవరించడంతో పాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు తాము ఉద్యమాన్ని చేపట్టినట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల సంఘం పనితీరుపై కూడా పలు ప్రశ్నలు సంధించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని పేర్కొంది.
సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సంఘీభావంగా..
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సంఘీభావంగా పశ్చిమ ఢిల్లీలోని హరీనగర్ బస్‌స్టాప్ నుంచి తిలక్‌నగర్ మెట్రోస్టేషన్ వరకూ బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పార్టీలోని ఇతర పెద్దలూ పాల్గొన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సంఘీభావంగా కార్యక్రమాలు జరుగుతున్న రోజే కాంగ్రెస్ మరో నిరసన కార్యక్రమానికి తెరతీయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పోటాపోటీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. రామ్‌లీలా మైదానంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయడంతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో పారామిలిటరీ సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భార్యతో అఫైర్ పెట్టుకున్న పొరుగింటి వ్యక్తిని చంపాడు.. 28 ఏళ్ల తర్వాత అరెస్టయ్యాడు..
మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..