మళ్లీ భయం మొదలైంది!
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:37 AM
తనపై సామూహిక అత్యాచారానికి తెగబడడంతోపాటు, తన కుటుంబాన్ని ఊచకోత కోసిన కేసులో ఇద్దరు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, వారి జైలు శిక్షను రద్దు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయ వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడుతోంది
ఇద్దరు దోషుల విడుదలపై బిల్కిస్ బానో
న్యూఢిల్లీ, నవంబరు 17: తనపై సామూహిక అత్యాచారానికి తెగబడడంతోపాటు, తన కుటుంబాన్ని ఊచకోత కోసిన కేసులో ఇద్దరు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, వారి జైలు శిక్షను రద్దు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలు తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేశాయని, న్యాయవ్యవస్థపై అపనమ్మకం ఏర్పడుతోందని మంగళవారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు, మళ్లీ తాను భయం గుప్పిట్లో చిక్కుకున్నట్టుగా ఉందన్నారు. దోషుల విడుదలకు ఆదేశాలు ఇచ్చేముందు సుప్రీంకోర్టు తనను ఒక్కమాట కూడా అడగలేదని, తాను మీడియా ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. ‘‘కన్నీళ్లు ఆపుకోలేక పోతున్నా. నా వాదన వినకుండానే ఈ ఆదేశాలు జారీ చేయడం.. నమ్మలేకుండా ఉన్నా’’ అని బానో పేర్కొన్నారు. ‘‘నాటి దారుణం జరిగిన సమయంలో నా వయసు 19 ఏళ్లు. ఆ రోజు నుంచి 24 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నా’’ అని బానో వివరించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై మరోసారి తాను న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేయడం, వారి యావజ్జీవ జైలు శిక్షను రద్దు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘ఇది.. మహిళగా, అంతకుమించి ముస్లిం మహిళగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించడమే.’’ అని వ్యాఖ్యానించింది
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా