Share News

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

ABN , Publish Date - Feb 12 , 2026 | 07:23 AM

బిహార్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..
forced marriage video

ఇంటర్‌నెట్ డెస్క్: పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొంతమంది వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్‌ జిల్లాలోని జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ ‘బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం కన్ను నితీశ్ మీద పడింది. అతడిని తమ ఇంటి అల్లుడిని చేసుకోవాలని వారు భావించారు.


ఫిబ్రవరి 7వ తేదీన నితీశ్ కుమార్ లైబ్రరీకి వెళుతుండగా శంకర్ రాయ్ కుటుంబసభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. బాగా కొట్టి, డ్రగ్స్ ఇచ్చి మోర్వాలోని గుడి దగ్గరకు తీసుకెళ్లారు. బలవంతంగా శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమారితో పెళ్లి చేశారు. తర్వాత అతడ్ని ఇంట్లో బంధించారు. అయితే, పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నితీశ్‌కు విముక్తి లభించింది. ఆ వీడియో చూసిన సమస్తీపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు శంకర్‌రాయ్ ఇంటికి వెళ్లారు. నితీశ్‌ను అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు. అతడిని విచారించారు.


నితీశ్ జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బిహార్ రాష్ట్రంలో ‘పకడ్వా వివాహ్‌’లు తరచుగా జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న, ఉన్నత చదువులు చదివిన యువకులే టార్గెట్‌గా బలవంతపు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్క 2009 సంవత్సరంలోనే ఏకంగా 1224 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి. అమ్మాయిల తరఫు వారు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 9:30 గంటల నుంచి కరెంట్ కట్

పెంగ్విన్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు

Updated Date - Feb 12 , 2026 | 07:38 AM