ఆ చేపలను తినకండి.. బిహార్ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక
ABN , Publish Date - Sep 02 , 2026 | 08:04 AM
వరద నీటిలో నేపాల్ నుంచి బిహార్‌లోకి కొట్టుకువచ్చిన కొత్తరకం చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. వరద నీటిలోని చేపలు కలుషితమై ఉంటాయని, వాటి శరీరంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని తెలిపింది.
పాట్నా, సెప్టెంబర్ 2: వరద నీటిలో నేపాల్ నుంచి బిహార్‌లోకి కొట్టుకువచ్చిన కొత్తరకం చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. మెరుపు వరదల కారణంగా త్రిశూలీ నది నీరు బిహార్‌లోని గంధక్, కోసీ నదులలోకి వచ్చి చేరుతోంది. ఉత్తర బిహార్‌లో జనం ఈ రెండు నదుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేపాల్ వరదల కారణంగా ఈ రెండు నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. అంతేకాదు.. కొత్తరకం చేపలు పెద్ద మొత్తంలో వరద నీటిలో కనిపిస్తున్నాయి. వాటిని పట్టుకుని తిన్న జనం అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘ది అనిమల్ అండ్ ఫిషరీస్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్’ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వరద నీటిలో కనిపించే వింత చేపలను పట్టడం కానీ, అమ్మటం కానీ, తినటం కానీ చేయవద్దని హెచ్చరించింది. వరద నీటిలోని చేపలు కలుషితమై ఉంటాయని, వాటి శరీరంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని తెలిపింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే వరకు ఆగాలని సూచించింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డైరీ, ఫిషరీస్, అనిమల్ రీసోర్స్ అధికారుల సూచనలు..
ముందెన్నడూ చూడని లేదా వింతగా కనిపించే చేపలను తినకండి.
వరద నీటి నుంచి పట్టిన చేపలను కొనడం, అమ్మడం లేదా తినడం చేయవద్దు.
సంబంధిత శాఖ అధికారులతో సరిచూసుకోకుండా, పరిచయం లేని ఏ చేపనైనా సరే తినడానికి సురక్షితమైనదిగా భావించవద్దు.
వింత చేపలను తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లు తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం పొందండి.
వింత చేపలు ఎక్కడైనా కనిపిస్తే స్థానిక జిల్లా మత్స్యశాఖ అధికారికి లేదా స్థానిక యంత్రాంగానికి తెలియజేయండి.
పుకార్లను నమ్మవద్దు, భద్రత దృష్ట్యా వింత చేపలకు దూరంగా ఉండండి.
ఇవి కూడా చదవండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం!