బిహార్‌లో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:04 PM
బిహార్‌లోని అరేరియా జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని అరేరియా జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తారాబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీ వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్నవారు తేరుకునేలోపే వాహనం కాలువలో పడిపోయినట్లు సమాచారం. మృతులంతా సుపాల్ జిల్లాకు చెందినవారిగా తెలుస్తోంది. వీరంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో పడిపోయిన వాహనం నుంచి బాధితులను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి మృతితో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
మిడ్‌టర్మ్ ఫలితాలు.. యూఎస్‌పై అంతర్జాతీయ విద్యార్థుల్లో మళ్లీ ఆశలు
మే 23న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష