విద్యార్థులపై ఏకే-47తో కాల్పుల ఘటన.. సుప్రీంకోర్టులో బిహార్ ప్రభుత్వం అఫిడవిట్..
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:00 PM
నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడం నిజమేనని సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం తెలిపింది. జులై 25న సివాన్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేసింది.
బిహార్: నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడం నిజమేనని సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం తెలిపింది. జులై 25న సివాన్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేసింది. ఆందోళనకారుల మధ్య కానిస్టేబుల్ చిక్కుకుపోవడంతో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ మేరకు అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా జులై 25న నిరసనల్లో సివాన్‌లోని జేపీ చౌక్ వద్ద నిరసనకారుల మధ్య కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ చిక్కుకున్నాడని బిహార్ ప్రభుత్వం పేర్కొంది. వారి నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ ఏకే-47తో గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడని తెలిపింది. మరోవైపు, నిరసనకారులను చెదరగొట్టేందుకు హతి చౌక్ సమీపంలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ నిలేశ్ కుమార్ సింగ్ కూడా 9ఎంఎం పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పుకొచ్చింది. పోలీసుల చర్యలో ముగ్గురు ఆందోళనకారులకు చిన్నపాటి తుపాకీ గాయాలయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వారు ఏకే-47 బుల్లెట్లతో గాయపడలేదని తేల్చిచెప్పింది. అలాగే, కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ప్రదేశంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది.
మరోవైపు, కానిస్టేబుల్ అభిషేక్ కుమార్‌ను సస్పెండ్ చేశామని, అతను శాఖాపరమైన విచారణను ఎదుర్కొంటున్నాడని అఫిడవిట్‌లో బిహార్ ప్రభుత్వం తెలిపింది. ఆరోజు భద్రతా దళాలు సంయమనం పాటించాయని.. నిరసనకారులకు ఎలాంటి హాని కలిగించేందుకు ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులపై విపరీతమైన బలప్రయోగం చేయలేదనీ వివరించింది. ప్రభుత్వ ఆస్తుల నష్టం, అధికారులపై దాడులకు నిరసనల్లో చేరిన అసాంఘిక శక్తులే కారణమని ప్రభుత్వం ఆరోపించింది. అలాగే నిరసనలకు సంబంధించిన జిల్లాల వారీ వివరాలనూ సుప్రీంకోర్టుకు సమర్పించింది.
కాగా, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దురాగతాలకు పాల్పడ్డారని ఆగస్టు 17న ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనికి ప్రతిస్పందనగా బిహార్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు.. ఉద్యమ బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు..
బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్