Share News

ఓలా డ్రైవర్ మోసం..రూ.285ను రూ.5950గా మార్చి..

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:46 PM

బెంగళూరు చెందిన ఓ వ్యక్తి.. ఓలా రైడ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్రయాణికుల భద్రత, ఛార్జీల వ్యత్యాసాలు, వినియోగదారులకు మద్దతుగా కంపెనీ స్పందనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.

ఓలా డ్రైవర్ మోసం..రూ.285ను రూ.5950గా మార్చి..

బెంగళూరు, మార్చి18: నేటికాలంలో చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి వాటిని వినియోగిస్తున్నారు. అయితే తరచూ ఈ డ్రైవర్లలో కొందరు లైంగిక వేధింపులకు, మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ఓలా డ్రైవర్‪తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.


ఆ ప్రయాణికుడు ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు మెజిస్టిక్ నుంచి జలహళ్లికి వెళ్లేందుకు ఓలా ట్యాక్సీని బుక్ చేసుకున్నాడు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరానికి ప్రయాణికుడికి ఓలా యాప్‌లో రూ. 285 ఛార్జీ చూపింది. అయితే సదరు వ్యక్తి ప్రయాణం ముగిసేసరికి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయట. రూ.285ను కాస్తా డ్రైవర్ ఫోన్లో రూ.5950గా చూపించాడని ప్రయాణికుడు ఆరోపించాడు.అంతేకాక ఆ మొత్తం డబ్బులను చెల్లించాలని డ్రైవర్ బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. అదే సమయంలో తాను ఓలా యాప్‌లోని అత్యవసర సహాయ విభాగాన్ని సంప్రదించగా.. అక్కడి నుంచి భరోసా రాలేదని తెలిపాడు. తాను సమస్యను తెలియజేయగా.. ఇది భద్రతా సమస్య కిందకు వస్తుందా అంటూ ఓలా ఉద్యోగి ఎదురు ప్రశ్నవేశారని అన్నాడు. ఆ తర్వాత సదరు ఉద్యోగి అకస్మాత్తుగా కాల్ కట్ చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇక సదరు డ్రైవర్ సైతం తీవ్రస్థాయిలో కస్టమర్‌పై దూషణకు దిగాడు. ఇదే సమయంలో బాధితుడి ఇంటి యజమాని అక్కడికి చేరుకుని ఆ డ్రైవర్‪తో మాట్లాడాడు. అంతేకాక ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో బాధితుడు, అతడి ఇంటి యజమాని ఒక బైక్‌పై వెళ్తుండగా.. వెనుక ఓలా డ్రైవర్ అనుసరించాడు. కాసేపటి తర్వాత సదరు డ్రైవర్.. రూట్ మార్చుకుని ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని బాధితుడు ఆరోపించాడు. ప్రస్తుతం సదరు ప్రయాణికుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇరాన్ కోలుకోవడానికి పదేళ్లు పడుతుంది: ట్రంప్

ప్రచార ఆర్భాటాలు చేసి వదిలేసే ప్రభుత్వం మాది కాదు: డిప్యూటీ సీఎం భట్టి

Updated Date - Mar 18 , 2026 | 12:58 PM