Share News

సినిమా స్టైల్లో దొంగతనం.. క్షణాల్లో రూ.31 లక్షలు దోచేశారు

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:11 PM

బెంగళూరు శివారులోని బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని నలుగురు దుండగులు క్షణాల్లో దోచేశారు. పట్టపగలు.. నడిరోడ్డులో.. వాహనదారులు చూస్తుండగానే పొడవాటి కత్తితో బాధితుడ్ని బెదిరించి రూ.31.38 లక్షలతో పాటు స్కూటీతో ఉడాయించారు.

సినిమా స్టైల్లో దొంగతనం.. క్షణాల్లో రూ.31 లక్షలు దోచేశారు
A cinematic daylight robbery

బెంగళూరు, ఫిబ్రవరి 2: బెంగళూరు శివారులోని బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సినిమాను తలపించేలా ఓ దోపిడీ జరిగింది. స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని నలుగురు దుండగులు క్షణాల్లో దోచేశారు. పట్టపగలు.. నడిరోడ్డులో.. వాహనదారులు చూస్తుండగానే పొడవాటి కత్తితో బాధితుడ్ని బెదిరించి, స్కూటీతో పాటు రూ.31.38 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కైలాశ్ అనే వ్యక్తి ఉడాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఉడాన్ కంపెనీకి చెందిన 31.38 లక్షల రూపాయల్ని బ్యాగులో దాచుకుని స్కూటీపై బన్నేర్‌ఘట్ట వైపు బయలుదేరాడు. కైలాశ్.. కల్వారా రోడ్డుపై వెళ్తుండగా.. ఇంతలో నలుగురు వ్యక్తులు రెండు బైకుల మీద ఆయన్ను చుట్టుముట్టారు. బైకులను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు. ఆ వెంటనే పొడవాటి కత్తితో కైలాశ్‌ను బెదిరించి.. ఆయన వద్దనున్న నగదుతో కూడిన బ్యాగును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా స్కూటీని కూడా లాక్కున్నారు. రెండు బైకులపై ముగ్గురు, స్కూటీపై ఒకరు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దోపిడీ మొత్తం క్షణాల్లో జరిగిపోయింది. నిందితులు ఎంతో తెలివిగా వ్యవహరించి.. స్కూటీని కొన్ని కిలోమీటర్ల తర్వాత వదిలేసి వెళ్లిపోయారు. కైలాశ్ నేరుగా బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ దోపిడీ ఘటనపై ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘విదేశాల్లోనే కాదు.. భారత్‌లోనూ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది’.. ‘ఇంకా నయం డబ్బుల కోసం ఆ వ్యక్తిని చంపేయలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ తెల్ల జెర్సీలలోనే ఎందుకు ఆడతారు.. ఆసక్తికర కారణమంటంటే..

ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్

Updated Date - Feb 02 , 2026 | 01:07 PM