Share News

బీసీఐ చైర్మన్‌.. భారీగా అక్రమాలు!

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:23 AM

నల్సార్‌ విశ్వవిద్యాలయం న్యాయ విద్యార్థులపై చర్యలకు ఆదేశించి, తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్న బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) చైర్మన్‌, బీజేపీ ఎంపీ మనన్‌కుమార్‌ మిశ్రా...

బీసీఐ చైర్మన్‌.. భారీగా అక్రమాలు!

  • ట్రస్టును కాదని మరో ట్రస్టు

  • 150 కోట్ల బదిలీకి యత్నాలు

  • మనన్‌ మిశ్రా వైదొలగాలి

  • బీసీఐ కో-చైర్మన్‌ సదాశివరెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 22: నల్సార్‌ విశ్వవిద్యాలయం న్యాయ విద్యార్థులపై చర్యలకు ఆదేశించి, తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్న బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) చైర్మన్‌, బీజేపీ ఎంపీ మనన్‌కుమార్‌ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బీసీఐని వ్యక్తిగత ఆస్తిలా మార్చేసుకున్నారని, భారీగా అక్రమాలకు పాల్పడ్డారని బీసీఐ కో-చైర్మన్‌, సీనియర్‌ న్యాయవాది వైఆర్‌ సదాశివరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీసీఐ చైర్మన్‌ పదవికి 15 రోజుల్లోగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ లేఖ రాశారు. ఎంతో ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నానని.. ఇప్పటికీ మౌనంగా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తనపై పెట్టుకున్న విశ్వాసానికి ద్రోహం చేసినవాడిని అవుతానని పేర్కొన్నారు. ‘‘మనన్‌కుమార్‌ మిశ్రా బీసీఐని ఆయన వ్యక్తిగత ఆస్తిలా మార్చేశారు. బీసీఐ ట్రస్టును నిర్వీర్యం చేశారు. తాను ఎంచుకున్న కొందరితో 2020లో ‘బీసీఐ ట్రస్ట్‌ పెరల్‌ ఫస్ట్‌’ను ఏర్పాటు చేశారు. బీసీఐ నుంచి ఆ కొత్త ట్రస్టుకు రూ.150 కోట్లను బదిలీ చేసేందుకు తీర్మానం కూడా చేశారు. నేను, ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపినా తోసిపుచ్చారు. బీసీఐ అనుమతి, రెన్యూవల్‌ కోసం న్యాయ కళాశాలల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లకు పాల్పడ్డారు. తాము నియంత్రించాల్సిన సంస్థల నుంచి ఇలా వసూళ్లకు పాల్పడటంతో.. బీసీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. బీసీఐ, దాని విద్యాసంస్థలను మనన్‌మిశ్రా బంధువులు, సన్నిహితులతో నింపేశారు. ఆ నియామకాలకు సంబంధించిన పత్రాలు, జాబితాలేవీ కౌన్సిల్‌ ముందు పెట్టలేదు’’ అని వైఆర్‌ సదాశివరెడ్డి పేర్కొన్నారు. మనన్‌ మిశ్రా బీసీఐ చైర్మన్‌ పదవికి 15 రోజుల్లోగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, సదాశివరెడ్డి ఆరోపణలు కేవలం వ్యక్తిగతం, రాజకీయ ప్రేరేపితమని మనన్‌కుమార్‌ మిశ్రా విమర్శించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని సదాశివరెడ్డికి సవాల్‌ చేశారు. తాను ఎన్నికల ద్వారానే 12ఏళ్లుగా చైర్మన్‌ పదవిలో ఉన్నానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 06:23 AM