Share News

దుస్తుల్లో.. సాక్సుల్లో నోట్లకట్టలు!

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:36 AM

అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలను అడ్డగోలుగా దోచుకున్న ఉదంతాలు బయటకొస్తున్నాయి. నగదు విరాళాల్ని లెక్కించే సిబ్బంది.. నోట్లకట్టలను తమ దుస్తుల్లో,.

దుస్తుల్లో.. సాక్సుల్లో నోట్లకట్టలు!

  • అయోధ్య రామాలయం విరాళాల దోపిడీలో మరో కోణం

  • నగదు లెక్కింపు సిబ్బంది నిర్వాకం..

  • సీసీటీవీ ఫుటేజీల్లో వెల్లడి

  • నిందితులందరూ ఇప్పటికే అరెస్టు

అయోధ్య, న్యూఢిల్లీ, జూలై 3: అయోధ్య రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలను అడ్డగోలుగా దోచుకున్న ఉదంతాలు బయటకొస్తున్నాయి. నగదు విరాళాల్ని లెక్కించే సిబ్బంది.. నోట్లకట్టలను తమ దుస్తుల్లో, సాక్స్‌లలో దాచుకొని బయటకు తీసుకువెళ్లిన సంగతి తాజాగా వెల్లడైంది. విరాళాల కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌), అయోధ్య పోలీసులు గత 45 రోజుల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా వీటి గురించి తెలిసింది. నగదు లెక్కింపు విధుల్లో ఉన్న ఐదుగురు.. తమ ముందున్న కరెన్సీ నోట్ల కుప్ప నుంచి కొన్ని నోట్లకట్టలను దాచుకుంటున్న దృశ్యాలు కనిపించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలోనే, ఆ ఐదుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నాయి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. నగదు విరాళాల లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ రికార్డులు 45 రోజుల వరకే ఉన్నాయని, అంతకు ముందు ఎంతకాలంగా ఈ దోపిడీ జరుగుతూ వచ్చిందో తెలియదని పేర్కొన్నారు. మరోవైపు, భక్తుల నుంచి వచ్చే విలువైన కానుకలకు ఎటువంటి లెక్కాపత్రం ఉండేది కాదని, రసీదులు ఇచ్చేవారు కాదని అయోధ్య ఆలయం పూజారుల్లో ఒకరైన మహంత్‌ వినోద్‌మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు సిట్‌ ఎదుట హాజరై ఆయన ఇచ్చిన వాంగ్మూలం తాలూకు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ముంబైకి చెందిన తన శిష్యులు కొందరు.. అయోధ్య రాముడికి వెండి పాదుకలు, ఇతర ఆభరణాలు సమర్పిస్తామని తనతో చెప్పారని, దీనిపై అయోధ్య ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ డ్రైవర్‌ రాంశంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్నూ యాదవ్‌తో మాట్లాడి దర్శనం ఏర్పాట్లు చేయించాలని చెప్పానని వినోద్‌మిశ్రా తెలిపారు. గత ఏడాది అక్టోబరులో ఆ భక్తులు రాముడి దర్శనం చేసుకొని కానుకలు సమర్పించారని, రసీదులు అడిగితే తర్వాత పంపిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. నెలలు గడిచినా ఎటువంటి రసీదులను వారికి పంపించలేదని పేర్కొన్నారు.

దీంతో, సదరు కానుకల గురించి తెలుసుకోవటానికి తాను స్వయంగా కరసేవాపురం వెళ్లానని, అక్కడ ఆ కానుకల జాడ కూడా లేదని తెలిపారు. ఆలయ నిర్వహణను చూసే రామజన్మభూమి ట్రస్టు పూర్తి వైఫల్యమే ఈ అవినీతి కార్యకలాపాలకు కారణమని, ట్రస్టును రద్దు చేసి మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాలని వినోద్‌మిశ్రా సూచించారు. వినోద్‌మిశ్రా వెల్లడించిన వివరాల నేపథ్యంలో.. మాయమైన కానుకల గురించి సిట్‌ ఆరా తీస్తోందని, రసీదులు తీసుకోకుండా కానుకలు సమర్పించిన భక్తుల నుంచి మరింత సమాచారం రాబట్టి దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇదే క్రమంలో, గత ఐదేళ్లకు సంబంధించి రామజన్మభూమి ట్రస్టు బ్యాంకు ఖాతాలపై రీఆడిట్‌ జరపాలని సిట్‌ నిర్ణయించింది. కాగా, ఇప్పటికే అరెస్టైన నిందితుల్లో ఒకడైన అవనీశ్‌శుక్లాను సిట్‌ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. నగదు లెక్కింపులో పాల్గొన్న అవినీశ్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.20.39 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇతర నిందితుల్లో కరుణేశ్‌పాండే నుంచి రూ.18.07 లక్షలు, అనుకల్ప్‌ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, లవకుశ్‌ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, రమాశంకర్‌ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, రాంశంకర్‌ యాదవ్‌ అలియాస్‌ టిన్నూ యాదవ్‌ నుంచి రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు.

వారిద్దరి ఇష్టారాజ్యం

అయోధ్య రామాలయం నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలను ట్రస్టుకు చెందిన ప్రముఖులు సిఫారసు చేసిన వ్యక్తులతో, వారి బంధువులతో నింపేవారని ట్రస్టు మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఉద్యోగంలో కొనసాగించాలన్నా కూడా వారితో ఉన్న సంబంధాల ఆధారంగానే నిర్ణయం తీసుకునేవారని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ కార్యకలాపాలు ట్రస్టు మాజీ సభ్యుడు అనిల్‌మిశ్రా, అధికారి గోపాల్‌రాయ్‌ కనుసన్నల్లో జరిగేవని, సిబ్బందిని వారు వేధించేవారని.. దీంతో పలువురు ఉద్యోగులు పని మానేసి వెళ్లిపోయారని తెలిపారు. చిన్నపాటి సంస్థలకు పనులు అప్పగించాల్సి వస్తే.. వాటి నుంచి కమీషన్లు తీసుకునేవారని ఆ ఉద్యోగి పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Updated Date - Jul 04 , 2026 | 08:02 AM