అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్..!
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:29 PM
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు..
లఖ్‌నవూ: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు.. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంపత్ రాయ్‌కు విరాళాల చోరీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సిట్ తన తొలి నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిట్ తన నివేదికను రాష్ట్ర హోంశాఖకు ఇవ్వగా.. ఈ నివేదిక పరిశీలన అనంతరం తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించినట్లు సమాచారం.
యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలో చంపత్ రాయ్‌తో పాటు మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్లు కూడా లేవని సమాచారం. అయితే, విరాళాల వ్యవహారంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ జూన్ 27న ట్రస్ట్‌లోని తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో జూన్ 13న తొలి సిట్‌ను ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేపట్టింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరో సిట్..
రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సిట్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు పురోగతిని వివరిస్తూ సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఫోరెన్సిక్ ఆడిటర్‌తో కూడిన సిట్ నివేదికను ముందుగా కోర్టు పరిశీలిస్తుందని, అనంతరం దాన్ని కేసులోని సంబంధిత పక్షాలతో పంచుకోవాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. దర్యాప్తు నాణ్యత, పారదర్శకతను మెరుగుపరిచేందుకు పిటిషనర్లు, ఇతర ప్రజాహిత వ్యక్తులు ఇచ్చే సూచనలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సిట్‌కు కోర్టు సూచించింది.
Also Read:
ఫ్లోరైడ్.. నిజంగా మెదడును ప్రభావితం చేస్తుందా?
17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు