Share News

అయోధ్య విరాళాల చోరీ కేసు.. సిట్ చేతికి కీలక ఆధారాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:29 AM

అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ చేతికి కీలక ఆధారాలు దొరికాయి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా సిట్ అధికారులు గుర్తించారు.

అయోధ్య విరాళాల చోరీ కేసు.. సిట్ చేతికి కీలక ఆధారాలు
Ayodhya donation theft

లఖ్‌నవూ, జులై 7: అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ చేతికి కీలక ఆధారాలు దొరికాయి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా సిట్ అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తులు 70 సార్లు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. యూపీ ప్రభుత్వానికి అందించిన రిపోర్టులో సిట్ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. నిందితులు నోట్ల కట్టల నుంచి కొన్ని నోట్లను విడిగా తీసి జేబుల్లో.. సాక్సుల్లో దాచుకున్నారు. ఆ తర్వాత వాటిని లెక్కింపు గదికి ఆనుకుని ఉన్న బాత్ రూములో దాచిపెట్టారు.


సరైన సమయం చూసుకుని అక్కడినుంచి బయటకు తరలించేవారు. సిట్ అధికారులు అధికారిక దర్యాప్తును ప్రారంభించడానికి ముందే అయోధ్య పోలీసులు నిందితుల నుంచి సుమారు రూ. 78.94 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జూన్ 4వ తేదీన లెక్కింపు గది బాత్ రూమ్ నుంచి మరో 2.25 లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు. లెక్కింపు గదిలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సిబ్బందికి ఎలాంటి తనిఖీలు చేయకపోవడం.. వారి వ్యక్తిగత వస్తువులపై నిఘా లేకపోవడం వల్లే ఈ భారీ చోరీ సాధ్యమైందని సిట్ అధికారులు తేల్చారు.


రోజుకు 6-8 లక్షల రూపాయల చోరీ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్స్‌లో ప్రతీ రోజు 16-18 లక్షల రూపాయలు డిపాజిట్ అయ్యేది. అయితే, విరాళాల చోరీ కేసు తర్వాత ఆ మొత్తం 24-26 లక్షల రూపాయల వరకు పెరిగింది. బ్యాంకు డిపాజిట్ల లెక్కలను బట్టి ప్రతీ రోజు 6-8 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలు.. కాబోయే భార్య ఆకృతి క్లారిటీ

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

Updated Date - Jul 07 , 2026 | 11:56 AM