విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:12 PM
అయోధ్య రామమందిర విరాళాల చోరీ విషయంలో బీజేపీని టార్గెట్ చేసిన ఆప్ అధినేత, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం మరిన్ని విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ విషయంలో బీజేపీని టార్గెట్ చేసిన ఆప్ అధినేత, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం మరిన్ని విమర్శలు చేశారు. రాక్షస లక్షణాలు ఉన్న వారే సుందరకాండ పఠనాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. విరాళాల చోరీకి నిరసనగా ఆప్ ఆధ్వర్యంలో పలు ప్రాంతంలో సుందరకాండ పఠనం జరిగింది. ఈ చర్యను పొలిటికల్ గిమ్మిక్‌గా బీజేపీ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ప్రతిదాడికి దిగారు. ‘కలియుగంలో రాక్షస లక్షణాలు ఉన్న వారే సుందరకాండ పఠనాన్ని వ్యతిరేకిస్తారని శ్రీరాముడు చెప్పాడు. భగవంతుడు శ్రీరాముడి ఇంట్లో చోరీకి పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్న సంకల్పంతో నేడు మేము సుందరకాండ పఠనాన్ని నిర్వహించాము’ అని అన్నారు. నిందితులకు ఉరి శిక్ష పడే వరకూ తాము విశ్రమించేది లేదని చెప్పారు.
ఢిల్లీలోని జపనీస్ పార్క్‌లో ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రామనామాన్ని బీజేపీ వాడుకుంటోందని అన్నారు. మరోవైపు, ఆప్ చర్యలను డ్రామా అంటూ బీజేపీ కొట్టిపారేసింది. కేజ్రీవాల్ ఒక పొలిటికల్ హిందూ అని విమర్శించింది. ‘నేడు కేజ్రీవాల్ మరోసారి మనకు శ్రీరాముడిని గుర్తు చేశారు. మళ్లీ ఆయన నాటకాలు మొదలయ్యాయి. 2024 జనవరిలో కూడా ఇలాగే చేశారు. అప్పట్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో డ్రామాకు తెరతీశారు. మళ్లీ అవే చర్యలను మొదలెట్టారు. పబ్లిక్ మాత్రం ఆయనను నమ్మే స్థితిలో లేరు’ అని ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ హర్ష్ మల్హోత్రా విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలివి!
పీఆర్‌సీపై కర్ణాటకలో పొలిటికల్ హీట్.. పాక్ జాతీయులు అరెస్ట్