Share News

చైనా సరిహద్దు గ్రామాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:43 PM

అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు గ్రామాల్లో వలసల పరిస్థితి మారుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గతంలో ఉపాధి, మౌలిక సదుపాయాల కొరత కారణంగా గ్రామాలను విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

చైనా సరిహద్దు గ్రామాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Union Minister Amit Shah

ఇటానగర్, నవంబర్ 22: అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు గ్రామాల్లో వలసల పరిస్థితి మారుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గతంలో ఉపాధి, మౌలిక సదుపాయాల కొరత కారణంగా గ్రామాలను విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. సుమారు 40 సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి వచ్చారని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలసలు, స్వయం సమృద్ధి, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా చైనా సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని వివరించారు. ఆయా గ్రామాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తదితర వస్తువులను స్థానిక రైతులు, సహకార సంఘాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.


అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.5,610 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 11 సరిహద్దు జిల్లాల్లో వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద రూ.110.95 కోట్లతో 199 అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు గ్రామాలు దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని, అక్కడి ప్రజలకు మెరుగైన జీవన సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వలసలను అరికట్టవచ్చని తెలిపారు. స్థానికంగా పాలు, చేపలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిని పెంచి గ్రామాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

సోనియా గాంధీ బాల్యం గడిపిన ఇల్లు ఎప్పుడైనా చూశారా.. నెట్టింట ఫొటోలు వైరల్..

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

Updated Date - Nov 22 , 2026 | 09:45 PM