Share News

శ్రీవారి ఆలయాల ప్రత్యేక అధికారిగా అర్జా శ్రీకాంత్‌

ABN , Publish Date - Nov 28 , 2026 | 02:19 AM

దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.

శ్రీవారి ఆలయాల ప్రత్యేక అధికారిగా అర్జా శ్రీకాంత్‌

  • ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలోని శ్రీవారి ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలు

న్యూఢిల్లీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. న్యూఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్‌, జమ్ములోని శ్రీవేంకటేశ్వర ఆలయాలకు ప్రత్యేక అధికారిగా ఆయనను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్‌, జమ్మూలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల పరిపాలన, భక్తుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని పర్యవేక్షించడంతో పాటు అసోం, ఉత్తరప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల్లో టీటీడీ సంబంధిత వ్యవహారాలను ఆయన సమన్వయం చేయనున్నారు. తన ప్రధాన బాధ్యతల్లో భాగంగా అర్జా శ్రీకాంత్‌ ప్రతి 15 రోజులకు ఒకసారి ఆలయాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, సమస్యలను గుర్తించి, దిద్దుబాటు చర్యలపై సిబ్బందికి మార్గదర్శకత్వం వహిస్తారు.

ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమగ్ర నివేదికలను టీటీడీ ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. ఆలయాల్లో ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం నిత్య కైౖంకర్యాలు, సేవలు, ఉత్సవాలు, తాజా పూల సరఫరా, సకాలంలో ప్రసాద వితరణ జరిగేలా చూడటంతో పాటు సులభతర దర్శనం, క్యూలైన్లు, పారిశుధ్యం, తాగునీరు, భద్రతా ప్రమాణాలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలను పర్యవేక్షిస్తారు. పరిశుభ్రమైన అన్నదానం, ధర్మ ప్రచార కార్యక్రమాలు, ఆర్థిక, ఈఆర్పీ నిబంధనల అమలు, హుండీ పర్యవేక్షణ, ఆలయ ఆస్తుల రక్షణ, టెండర్లు, ఉత్సవ ప్రతిపాదనలను కనీసం 3 నెలల ముందుగానే పూర్తి చేసే బాధ్యతలను నిర్వర్తిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 02:19 AM