వక్కల దిగుమతి రాకెట్ గుట్టు రట్టు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:18 AM
సఫ్టా(దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) పేరిట మోసపూరితంగా మినహాయింపులు పొంది రూ.2,500 కోట్ల సుంకం ఎగవేసిన వక్కల దిగుమతి రాకెట్ గుట్టును డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్)...
2500 కోట్ల సుంకం ఎగవేత
మోసపూరితంగా సఫ్టా మినహాయింపులు
విశాఖ, కోల్‌కతాల్లో డీఆర్‌ఐ సోదాలు
తొమ్మిది మంది అరెస్టు
160 టన్నుల వక్కలు స్వాధీనం
న్యూఢిల్లీ, ఆగస్టు 16: సఫ్టా(దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) పేరిట మోసపూరితంగా మినహాయింపులు పొంది రూ.2,500 కోట్ల సుంకం ఎగవేసిన వక్కల దిగుమతి రాకెట్ గుట్టును డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్) రట్టు చేసింది. సఫ్టా ఒప్పందం మేరకు బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోకి దిగుమతి చేసుకున్న వక్కలకు 100ు బీసీడీ(ప్రాథమిక కస్టమ్స్ సుంకం) మినహాయింపు లభిస్తుంది. అయితే, ఈ ముఠా ఇండోనేసియా, థాయిలాండ్, మలేసియా, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి తీసుకొచ్చిన వక్కలను బంగ్లాదేశ్ నుంచి తెచ్చినట్టు నమ్మించడం ద్వారా మోసపూరితంగా సుంకం మినహాయింపులు పొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రాకెట్‌లో సూత్రదారులు బంగ్లాదేశ్ అధికారుల నుంచి మోసపూరితంగా సఫ్టా సర్టిఫికెట్లు పొంది.. వాటితో దిగుమతిదారులకు లబ్ధి చేకూర్చడం ద్వారా పెద్ద మొత్తంలో కమీషన్లు పొందారని తెలిపింది. ఈ ముఠా ఆగ్నేయాసియా దేశాల నుంచి తెచ్చిన వక్కలను బంగ్లాదేశ్‌లోని ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ద్వారా భారత్‌లోకి దిగుమతి చేసుకుందని, తిరిగి ప్యాకింగ్ చేయడం ద్వారా అది బంగ్లాదేశ్ వక్కేనని నమ్మించిందని పేర్కొంది. విశాఖపట్నం, కోల్‌కతాల్లోని దిగుమతిదారులు, కస్టమ్స్ బ్రోకర్లు తదితరుల కార్యాలయాల్లో డీఆర్‌ఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించి వీరి గుట్టును రట్టు చేసినట్టు వివరించింది. 9మందిని అరెస్టు చేయడంతోపాటు రూ.75 లక్షల నగదు, 160 టన్నుల వక్కలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు