ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:06 AM
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతూ ఎంతటి పటిష్ఠ భద్రత ఉన్న సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను అయినా హ్యాక్ చేస్తుండటంతో ఆ రంగంలోని పెద్ద కంపెనీలు కూడా వణికిపోతున్నాయి.
ఇద్దరు భారతీయ మిత్రులతో కలిసి
అమెరికాలో ‘హ్యాకత్రాన్ ఏఐ’
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతూ ఎంతటి పటిష్ఠ భద్రత ఉన్న సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను అయినా హ్యాక్ చేస్తుండటంతో ఆ రంగంలోని పెద్ద కంపెనీలు కూడా వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ క్లాడ్, ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ కొమ్ములు తిరిగిన సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులకు కూడా సవాల్ విసురుతున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఏకంగా ఓపెన్ ఏఐ సిస్టమ్స్‌నే హ్యాక్ చేసి సంచలనం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు పరిధిలో ఉన్న సంపత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2013-15 మధ్య మోహన్ పెద్దపాటి అనే విద్యార్థి చదువుకున్నాడు. నూజివీడు ఆర్జీయూకేటీలో 2015-21 మధ్య బీటెక్ చదివిన అతడు.. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం హర్ష జైస్వాల్, రాహుల్ మైనీ అనే ఇద్దరు భారతీయ మిత్రులతో కలిసి హ్యాకత్రాన్ ఏఐ అనే కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీకి అతడు సీటీవోగా సేవలందిస్తున్నాడు. వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సోర్స్‌కోడ్ రివ్యూ, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో నిష్ణాతుడైన ఇతడు.. పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలు తయారుచేసే సాఫ్ట్‌వేర్లలో లోపాలను గుర్తించటంలో దిట్ట. ఎథికల్ హ్యాకింగ్‌లో భాగంగా గత జూలైలో తన ఇద్దరు మిత్రులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కంపెనీ ఓపెన్ ఏఐ సిస్టమ్స్‌నే హ్యాక్ చేశాడు. ఇందుకోసం వీరు ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ టూల్ సహాయం తీసుకున్నారు. కేవలం రూ.2.5 లక్షల విలువైన ఏఐ టోకెన్లను వినియోగించి 72 గంటల్లో ఓపెన్ ఏఐని హ్యాక్ చేసేశారని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఈ టెకీలపై ప్రశంసలు కురిపించింది.