Share News

బీజేపీకి అన్నామలై గుడ్‌ బై!

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:29 AM

బీజేపీకి ఆ పార్టీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై గట్టి షాకివ్వబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. ఈ నెల 15వ తేదీ లోపు కొత్త పార్టీని...

బీజేపీకి అన్నామలై గుడ్‌ బై!

కొత్త పార్టీ ఏర్పాటుపై 15లోగా ప్రకటన

చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి ఆ పార్టీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై గట్టి షాకివ్వబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. ఈ నెల 15వ తేదీ లోపు కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు తిరుచ్చి జిల్లా పెరుందురై అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. 2011 కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి తన పదవికి రాజీనామా చేసి.. 2019లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన రెండు వారాలకే రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. రెండేళ్లకే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2021 జూలై నుంచి 2025 ఏప్రిల్‌ వరకు ఆ పదవిలో కొనసాగారు. డీఎంకే ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున ఉద్యమించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి హయాం వరకు జరిగిన అవినీతి చిట్టాను కూడా బయటపెట్టారు. దీంతో అన్నామలైపై ఆగ్రహించిన ఈపీఎస్‌.. ఆయన్ను పదవి నుంచి తొలగిస్తే తప్ప బీజేపీతో చేతులు కలపలేమని చెప్పడంతో ఆ పార్టీ అన్నామలైని పక్కనబెట్టింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు గానీ, ఆయన మద్దతుదారులకు గానీ టికెట్లు ఇవ్వలేదు. అయితే విజయ్‌ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయంతో బీజేపీకి తమిళనాట భవిష్యత్‌ లేదని అన్నామలై నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ‘అన్నామలై అన్బు కూట్టం’ పేరుతో అన్నామలై అభిమాన సంక్షేమ సంఘం పెద్దఎత్తున అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘నిర్భీతి మనసుకు ఎల్లలు లేవు’ అనే నినాదంతో ఇవి జిల్లా అంతటా వెలిశాయి. ‘మక్కల్‌ సేవై కట్చి’(ప్రజా సేవ పార్టీ) పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం.


రెండ్రోజుల్లో చెబుతా: అన్నామలై

సోమవారం సాయంత్రం చెన్నై నుంచి ఢిల్లీ బయల్దేరిన అన్నామలై.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో అన్ని విషయాలూ చెబుతానని వెల్లడించారు. కొత్త పార్టీ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌తో భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన నిర్ణయం గురించి చెప్పి గౌరవప్రదంగా వైదొలిగేందుకే అన్నామలై ఢిల్లీ వెళ్లారని, ఆయన నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చని సన్నిహితులు తెలిపారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 06:29 AM