వాహన యాజమాన్య సులభతర సూచీలో ఏపీ ఫస్ట్
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:23 AM
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు సాధించింది. వాహన యాజమాన్య సులభతర సూచీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.
రాష్ట్రానికి ఇండియాటెక్, కన్స్యూమర్ వాయిస్ ప్రతిష్ఠాత్మక పురస్కారం
న్యూఢిల్లీ, నవంబర్ 4(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు సాధించింది. వాహన యాజమాన్య సులభతర సూచీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. పాత వాహనాల యాజమాన్య బదిలీల్లో విధానపరమైన, నియంత్రణ వ్యవస్థలు, డిజిటల్ మౌలిక వసతులు, సేవలందించడంలో సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, వ్యవస్థాగత నిర్వహణ, వ్యయం అందుబాటు వంటి కీలక అంశాల ఆధారంగా ఈ సూచీతో కూడిన నివేదికను ఇండియాటెక్.ఆర్గ్, కన్స్యూమర్ వాయిస్ రూపొందించాయి.
బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక కార్యక్రమంలో.. ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తరఫున ఏపీభవన్ ఉన్నతాధికారి కదిరి మోహన ప్రభాకర్ పురస్కారాన్ని స్వీకరించారు. కేరళ, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి అందుబాటులో ఉన్న కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న ‘బయోమెట్రిక్ ప్రీ-అథెంటికేషన్’ వంటి వినూత్న విధానాలను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్